Ravi Shastri: ఆ సమయంలో కోహ్లీ షాక్ లో ఉన్నాడు: రవిశాస్త్రి

  • 2014 ఇంగ్లండ్ టూర్ లో ఘోరంగా విఫలమైన కోహ్లీ
  • ఆ సిరీస్ తర్వాత కోహ్లీ నిరాశ, నిస్పృహలకు గురయ్యాడన్న శాస్త్రి
  • ఆ తర్వాత ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటూ.. మళ్లీ ఫామ్ లోకి వచ్చాడని వ్యాఖ్య
Virat Kohli Was In State Of Shock says Ravi Shastri

2014లో జరిగిన ఇంగ్లండ్ పర్యటన విరాట్ కోహ్లీ కెరీర్ లోనే ఒక డిజాస్టర్ గా చెప్పుకోవచ్చు. ఆ టూర్ లో జరిగిన ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో కోహ్లీ 1, 8, 25, 0, 39, 28, 0, 7, 6, 20 పరుగులు చేశాడు. ఆ టూర్ ముగిసిన తర్వాత రవిశాస్త్రి టీమిండియా హెడ్ కోచ్ గా బాధ్యతలను స్వీకరించారు.

దీనిపై రవిశాస్త్రి స్పందిస్తూ... అప్పుడు కోహ్లీ షాక్ లో ఉన్నాడని, నిరాశ, నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్నాడని చెప్పారు. ఒక్కసారి మళ్లీ లైన్లోకి వస్తే కోహ్లీ వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితి ఉండదని తనకు తెలుసని చెప్పారు. ఆ తర్వాత కోహ్లీ కొన్ని బ్యాటింగ్ టెక్నిక్ లపై దృష్టి సారించాడని, మళ్లీ ఫామ్ ను అందుకున్నాడని తెలిపారు.

తాను హెడ్ కోచ్ గా బాధ్యతలను స్వీకరించిన తర్వాత కోహ్లీని చాలా నిశితంగా గమనించేవాడినని... రోజురోజుకు అతనిలో ఆత్మవిశ్వాసం పెరగడాన్ని తాను గమనించానని శాస్త్రి చెప్పారు. తన తొలి రెండు, మూడు నెలలు ఆటగాళ్ల గురించి తెలుసుకోవడానికే సరిపోయిందని... ఎన్నో అంశాలపై తామంతా మాట్లాడుకునే వాళ్లమని తెలిపారు.

2014-15 ఆస్ట్రేలియా టూర్ లో కోహ్లీ మళ్లీ ఫామ్ లోకి వచ్చాడని శాస్త్రి చెప్పారు. ఆ సిరీస్ లో కోహ్లీ నాలుగు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ చేశాడని తెలిపారు. ఆ సిరీస్ లో ఇండియా 2-0తో ఓడిపోయిందని చెప్పారు. సిడ్నీ టెస్టు ముగిసిన తర్వాత తన వద్దకు అలన్ బోర్డర్ వచ్చాడని... 'రవీ వెల్ డన్. చాలా బాగా ఆడారు. టెస్ట్ మ్యాచ్ ను కాపాడుకోవడానికి చివరి రోజు వరకు అన్ని టీములు పోరాడలేవు. మీ టీమ్ చాలా బాగా ఆడింది' అని ప్రశంసించారని తెలిపారు.

2017లో తాను రెండోసారి హెడ్ కోచ్ గా బాధ్యతలను స్వీకరించిన తర్వాత... తనను ఆ పదవి నుంచి దూరం చేసేందుకు ప్రయత్నాలు జరిగాయని శాస్త్రి తెలిపారు. దీనికోసం వారు ఒక వ్యక్తిని ఎంచుకున్నారని... 9 నెలల తర్వాత ఆ వ్యక్తిని తనపై ప్రయోగించారని చెప్పారు. తాను హెడ్ కోచ్ గా ఉండటం ఇష్టం లేకే ఆ పని చేశారని అన్నారు. టీమ్ ఎంపికలో తాను ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని చెప్పారు. 2019 వన్డే ప్రపంచకప్ లో అంబటి రాయుడిని తీసుకుంటే బాగుండేదని అన్నారు.

More Telugu News