Omicron: టీకాలు వేసుకున్నా.. ఒమిక్రాన్ వదిలిపెట్టదు: వేరియంట్‌ను తొలుత గుర్తించిన దక్షిణాఫ్రికా వైద్యురాలి హెచ్చరిక

Omicron can strike within four months of vaccination said Dr Angelique Coetzee
  • ‘డెల్టా’ కేసులు లేకపోవడంతో థర్డ్ వేవ్ నుంచి బయటపడ్డామనే అనుకున్నాం
  • వ్యాక్సిన్ తీసుకున్నా మూడు, నాలుగు నెలల్లో ఒమిక్రాన్ సోకే అవకాశం
  • లక్షణాలు స్వల్పంగా ఉండడంతో పరీక్షల నుంచి తప్పించుకుంటుంది
  • ఒమిక్రాన్‌లో డయేరియా లక్షణం లేదు
  • డాక్టర్ ఏంజెలిక్ కోయెట్జీ
ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా వైరస్‌లోని ఒమిక్రాన్ వేరియంట్‌ టీకా వేయించుకున్నా వదలదని దానిని తొలుత కనుగొన్న సౌతాఫ్రికా మెడికల్ అసోసియేషన్ చైర్ పర్సన్ డాక్టర్ ఏంజెలిక్ కోయెట్జీ పేర్కొన్నారు. ఈ వేరియంట్ సోకిన వారికి లక్షణాలు చాలా స్వల్పంగా ఉంటాయని, కాబట్టి గుర్తించడం అంత సులభం కాదని పేర్కొన్నారు. అంతేకాదు, మూడు, నాలుగు నెలల క్రితం టీకాలు వేయించుకున్న వారికి కూడా ఇది సోకే అవకాశం ఉందని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

ఇబుప్రోఫెన్‌తో కూడిన కార్టిసాల్‌తో తేలికపాటి మోతాదు ఇవ్వడం ద్వారా ఈ వేరియంట్ సోకిన బాధితులు త్వరగా కోలుకునే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు. పేద దేశాలకు ఇంజెక్షన్లు చేరవేయడం కష్టం కాబట్టి మహమ్మారిని అంతం చేసేందుకు ట్యాబ్లెట్లతో ముందుకు రావాలని డాక్టర్ ఏంజెలిక్ ఫార్మాస్యూటికల్ కంపెనీలను అభ్యర్థించారు.

ఇప్పటి వరకు వెలుగు చూసిన డెల్టా, బీటా, ఒమిక్రాన్ వేరియంట్ల క్లినికల్ పిక్చర్ మధ్య వ్యత్యాసాన్ని తాను గుర్తించినట్టు డాక్టర్ ఏంజెలిక్ తెలిపారు. తాను ఇప్పటి వరకు 600 మందికిపైగా డెల్టా రోగులకు చికిత్స చేసినట్టు చెప్పిన ఆమె.. తాను ఆ రోజు చూసిన మొదటి ఒమిక్రాన్ రోగిలో బీటాకు దగ్గరగా ఉండే వివిధ లక్షణాలు ఉన్నాయని తన క్లినికల్ అనుభవంతో చెప్పగలనని అన్నారు. అంతేకాదు, ఒకే విధమైన లక్షణాలను ప్రదర్శించే ఏడుగురు కొత్త రోగులను కూడా తాను చూశానని గుర్తు చేసుకున్నారు.

తాము కొన్ని రోజులపాటు డెల్టా కేసులను చూడకపోవడంతో మూడో వేవ్ నుంచి బయటపడ్డామనే అనుకున్నామని అయితే, ఒమిక్రాన్ రూపంలో కొత్త వేరియంట్ వెలుగు చూడడం తమను తీవ్ర ఆందోళనకు గురిచేసిందని పేర్కొన్నారు. కొత్త వేరియంట్‌ను తాము ఎలా కనుగొన్నామన్న విషయాన్ని మంత్రి మండలికి నివేదించినట్టు చెప్పారు.
 
డెల్టా వేరియంట్ సోకిన వారిలో జ్వరం, సాచ్యురేషన్ తక్కువగా ఉండడం, గొంతు వాపు, దగ్గు, రుచి, వాసన లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే.. ఒమిక్రాన్ రోగుల్లో ఒళ్లు నొప్పులు, మరీ ముఖ్యంగా కండరాల నొప్పి, తీవ్రమైన తలనొప్పి, విపరీతమైన అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయన్నారు. అయితే, టీకాలు తీసుకున్న వారిలో ఈ లక్షణాల తీవ్రత కొంత స్వల్పంగా ఉంటుందని పేర్కొన్నారు.

13 ఏళ్ల కంటే తక్కువ వయసున్న చిన్నారులు గొంతునొప్పి, జ్వరంతో బాధపడడంతోపాటు ఆకలిని కోల్పోతారని వివరించారు. ఇక్కడో ముఖ్యమైన విషయం గురించి కూడా చెప్పుకోవాలని, డెల్టా వేరియంట్‌లో తాము మూడు లేదంటే నాలుగో రోజున అతిసారం బారినపడడాన్నిచూశామని, కానీ, ఒమిక్రాన్‌లో డయేరియా లేదని డాక్టర్ ఏంజెలిక్ వివరించారు.
Omicron
Delta
Corona Virus
Vaccination
South Africa
Dr Angelique Coetzee

More Telugu News