Hyderabad: శునకం రేపిన చిచ్చు.. ఒకరి హత్య... ముగ్గురికి జీవితఖైదు విధించిన సంగారెడ్డి కోర్టు

  • ఇంట్లోకి వచ్చిన శునకాన్ని కొట్టి తరిమేసిన శ్రీనివాస్
  • కక్ష పెంచుకున్న శునక యజమాని ప్రశాంత్
  • మరో ఇద్దరితో కలిసి శ్రీనివాస్ హత్య
  • ఏడేళ్ల నాటి ఘటనలో తాజాగా తుది తీర్పు వెల్లడి
Sangareddy court impose life imprisonment to three in murder case

ఓ శునకం కారణంగా తలెత్తిన వివాదం ఒకరి హత్యకు దారి తీయగా, ఈ కేసులో ఏడేళ్ల తర్వాత ముగ్గురిని దోషులుగా తేల్చిన కోర్టు జీవిత ఖైదు, జరిమానా విధించింది. 2014లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు..

హైదరాబాద్ శివారులోని పటాన్‌చెరు మండలం ఇంద్రేశంలో నివసించే ప్రశాంత్ ఓ శునకాన్ని పెంచుకుంటున్నాడు. ఓ రోజు అది శ్రీనివాస్ అనే వ్యక్తి ఇంట్లోకి వెళ్లడంతో దానిని అతడు కొట్టి తరిమేశాడు. తాను పెంచుకుంటున్న శునకాన్ని కొట్టడాన్ని జీర్ణించుకోలేకపోయిన ప్రశాంత్ శ్రీనివాస్‌పై కక్ష పెంచుకున్నాడు.

శ్రీనివాస్‌పై పగ తీర్చుకోవాలని భావించిన ప్రశాంత్ రామచంద్రాపురం బొంబాయి కాలనీకి చెందిన ప్రకాశ్, వినోద్‌లను కలిసి విషయం చెప్పి సాయం కోరాడు. వారితో కలిసి అర్ధరాత్రి శ్రీనివాస్ ఇంటికి వెళ్లి అతడిని హత్య చేశాడు. వారిని అడ్డుకునే ప్రయత్నం చేసిన ఆయన భార్య రేణుకపైనా హత్యాయత్నానికి పాల్పడ్డారు.

కేసు నమోదు చేసుకున్న పటాన్‌చెరు పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టారు. తాజాగా, వీరిని దోషులుగా తేల్చిన సంగారెడ్డి రెండో అడిషనల్ జిల్లా కోర్టు ముగ్గురికీ జీవిత ఖైదుతోపాటు రూ. 5 వేల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది.

More Telugu News