Bipin Rawat: సొంత ఊరికి మంచి చేయాలని భావించి... తిరిగిరాని లోకాలకు వెళ్లిన బిపిన్ రావత్!

  • హెలికాప్టర్ ప్రమాదంలో రావత్ దంపతుల మృతి
  • ఢిల్లీలో అంత్యక్రియలు
  • దహనసంస్కారాలు నిర్వహించిన కుమార్తెలు
  • రావత్ మరణంతో విషాదానికి గురైన యావత్ దేశం
Bipin Rawat always wants to do favor for his native village

భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్, ఆయన అర్ధాంగి మధులిక రావత్ ల అంత్యక్రియలు ఢిల్లీలో పూర్తి సైనిక లాంఛనాల నడుమ జరిగాయి. యావత్ దేశాన్ని విషాదంలో ముంచెత్తుతూ రావత్ దంపతులు, మరో 11 మంది సైనిక సిబ్బంది హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలవడం తెలిసిందే.

గొప్ప సైనిక వ్యూహకర్తల్లో ఒకరిగా పేరుగాంచిన బిపిన్ రావత్ మరణం దేశానికి తీరని లోటు అని చెప్పాలి. దేశం కోసం అనునిత్యం తపించిన ఆయన తన సొంత ఊరికి ఎంతో చేయాలని తాపత్రయపడ్డారు. కానీ ఆ కోరిక తీరకుండానే కన్నుమూశారు. ఆయన స్వగ్రామం ఉత్తరాఖండ్ లోని పౌరి గర్వాల్ జిల్లాలోని సైనా గ్రామం. రావత్ కుటుంబానికి చెందిన నాలుగు తరాల వారు సైన్యంలో చేరి దేశానికి సేవలందించడం విశేషం.

తాను రిటైర్ అయిన తర్వాత సొంత ఊర్లో ఇల్లు నిర్మించుకోవాలని రావత్ భావించారు. తన ఊరి బాగు కోసం ఏదో ఒకటి చేయాలని ఆలోచించేవారు. గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు పలు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఆయన భార్య మధులిక స్వస్థలం మధ్యప్రదేశ్ లోని షాడోల్ జిల్లాలోని సోహాగ్ పూర్ గర్హి. కాగా, తన భార్య సొంత జిల్లాలో ఓ సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయాలన్నది కూడా ఆయన లక్ష్యాల్లో ఒకటి. అయితే, ఆ కోరికలు ఏవీ తీరకుండానే ఆయన కన్నుమూయడం అత్యంత బాధాకరం.

తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో రావత్, మధులిక ఇద్దరూ చనిపోవడంతో వారి కుమార్తెలు కృతిక, తరిణి అంత్యక్రియలు నిర్వహించారు. పెద్ద కుమార్తె కృతికకు వివాహం జరిగింది. ఆమెకు ఓ కుమారుడు ఉన్నాడు. వారి కుటుంబం ముంబయిలో నివసిస్తోంది. చిన్న కుమార్తె తరిణి న్యాయవాది. ఆమె తల్లిదండ్రులతో కలిసి ఢిల్లీలో ఉంటోంది. రావత్ అర్ధాంగి మధులిక మరణంలోనూ భర్త వెన్నంటే ఉండడం అందరినీ కలచివేస్తోంది.

మధులిక సాధారణ గృహిణి అనుకుంటే పొరబాటే! ఆమె సైనికుల భార్యల సంక్షేమం సంఘం (ఏడబ్ల్యూడబ్ల్యూఏ) అధ్యక్షురాలు. మధులిక విద్యాభ్యాసం ఢిల్లీలో సాగింది. ఆమె ఢిల్లీ యూనివర్సిటీ నుంచి సైకాలజీలో డిగ్రీ పట్టా అందుకున్నారు. బిపిన్ రావత్ తో ఆమె వివాహం 1986లో జరిగింది. అప్పటికి రావత్ సైన్యంలో కెప్టెన్ గా ఉన్నారు.  సైనికుల భార్యలు, పిల్లలు, ఇతర కుటుంబసభ్యుల సంక్షేమం కోసం మధులిక ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. సైన్యంలో పనిచేసే తమ భర్తలను కోల్పోయిన మహిళలు, క్యాన్సర్ రోగులు, దివ్యాంగ చిన్నారుల అభ్యున్నతి కోసం ఎంతో పాటుపడ్డారు.

More Telugu News