Bipin Rawat: రావత్ మృత‌దేహానికి ప్ర‌ముఖుల నివాళులు.. కాసేప‌ట్లో సైనిక లాంఛనాల నడుమ తుది వీడ్కోలు

  • నివాళులు అర్పించిన మోదీ, రాజ్‌నాథ్‌, అమిత్ షా
  • కామరాజ్ మార్గ్ నుంచి ఢిల్లీ కంటోన్మెంట్ వ‌ర‌కు అంతిమ యాత్ర‌
  • బ్రిగేడియర్‌ ఎల్‌ఎస్‌ లిద్దర్‌ అంతిమ సంస్కారాలు పూర్తి
  • సైనిక లాంఛనాల నడుమ లిద్దర్‌కు తుది వీడ్కోలు
The mortal remains of CDS Gen Bipin Rawat and his wife Madhulika Rawat were brought to their residence

సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ తో పాటు ఆయ‌న భార్య మధులికా రావత్ అంత్యక్రియలు కాసేప‌ట్లో జ‌ర‌గ‌నున్నాయి. ఢిల్లీలోని కంటోన్మెంట్ శ్మశాన వాటికకు వారి మృత‌దేహాల‌ను త‌ర‌లించ‌నున్నారు. నిన్న‌ సాయంత్రం వారి భౌతిక కాయాలను త‌మిళ‌నాడు నుంచి సైనిక విమానంలో ఢిల్లీకి తరలించిన విష‌యం తెలిసిందే.

ప్ర‌జ‌లు, ప్ర‌ముఖుల సంద‌ర్శ‌నార్థం రావత్ దంపతుల భౌతిక కాయాలను  వారి నివాసం వ‌ద్ద ఉంచారు. మ‌ధ్యాహ్నం 2 గంట‌ల అనంత‌రం  కామరాజ్ మార్గ్ నుంచి ఢిల్లీ కంటోన్మెంట్లోని బ్రార్ స్క్వేర్ శ్మశాన వాటిక వ‌ర‌కు అంతిమయాత్ర నిర్వహిస్తారు. సైనిక లాంఛనాల నడుమ తుది వీడ్కోలు ప‌ల‌క‌నున్నారు.

కాగా, ఈ రోజు ఉద‌యం నుంచి రావత్ దంప‌తుల‌తో పాటు 11 మంది జ‌వాన్ల మృత‌దేహాల‌కు ప్ర‌ముఖులు నివాళులు అర్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమర వీరుల‌కు  నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో పాటు కేంద్ర మంత్రి అమిత్ షా, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జోతిరాదిత్య సింధియా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తదితరులు 13 మంది భౌతిక కాయాల‌కు నివాళులర్పించారు.

కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌ గాంధీ,  మల్లికార్జున ఖర్గే, హరీశ్‌ రావత్ తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు అంజలి ఘటించారు. అనంత‌రం మధ్యాహ్నం 12.30 గంటల నుంచి సైనిక సిబ్బంది నివాళులర్పిస్తున్నారు. సాయంత్రం సైనిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు. మ‌రోవైపు,  బ్రిగేడియర్‌ ఎల్‌ఎస్‌ లిద్దర్‌ అంతిమ సంస్కారాలు ఇప్పటికే పూర్తయ్యాయి. సైనిక లాంఛనాల నడుమ లిద్దర్‌కు తుది వీడ్కోలు పలికారు.

More Telugu News