'ఆర్ ఆర్ ఆర్' ప్రభంజనం కోసం ఎదురుచూస్తున్నాను: మెగాస్టార్

09-12-2021 Thu 17:17
  • ఈ రోజున రిలీజ్ అయిన 'ఆర్ ఆర్ ఆర్' ట్రైలర్
  • ప్రధానపాత్రలను కవర్ చేస్తూ కట్ చేసిన ట్రైలర్
  • భారీ బడ్జెట్ తో నిర్మించిన డీవీవీ దానయ్య
  • జనవరి 7వ తేదీన విడుదల  
Chiranjeevi said about RRR trailer
రాజమౌళి నుంచి వస్తున్న 'ఆర్ ఆర్ ఆర్' కోసం అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అందుకు కారణం ఇంతకుముందు ఆయన నుంచి వచ్చిన భారీ సినిమాలు .. అవి సాధించిన సంచలన విజయాలు. సుదీర్ఘ కాలంగా షూటింగు జరుపుకుంటూ వచ్చిన ఈ సినిమా, అనేక విశేషాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

జనవరి 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. ప్రధానమైన పాత్రలను కవర్ చేస్తూ, ఈ రోజు ఉదయం ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఎన్టీఆర్ .. చరణ్ పాత్రల స్వరూప స్వభావాలకు అద్దం పడుతూ ఆవిష్కరించిన ఈ ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంటోంది.

ఈ ట్రైలర్ చూసిన చిరంజీవి .. వెంటనే ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఈ ట్రైలర్ బీభత్సాన్ని సృష్టించిందనీ .. ఇక ప్రభంజనం కోసం జనవరి 7వ తేదీ వరకూ ఎదురుచూస్తుంటానని ఆయన రాసుకొచ్చారు. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమా, సంచలనానికి తెరదీయడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.