జనరల్ రావత్ హెలికాప్టర్ కూలిపోవడంపై అనుమానాలున్నాయి: సుబ్రహ్మణ్య స్వామి

09-12-2021 Thu 15:55
  • హెలికాప్టర్ కూలిపోతున్న వీడియోను నేను చూశా
  • ఆ వీడియో నిజం కాదు
  • సుప్రీంకోర్టు జడ్జి వంటి వారి చేత విచారణ జరిపించాలి
BJP Subrahmanya Swamy expresses doubts on Bipin Rawats helicopter crash
భారత త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిన విషయంలో పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి కూడా ఈ ఘటనపై అనుమానం వ్యక్తం చేశారు. కూలిపోతున్న హెలికాప్టర్ గా చెబుతూ ప్రచారమవుతున్న వీడియోను తాను అత్యంత విశ్వసనీయమైన వర్గాల ద్వారా చూశానని... వాస్తవానికి అది సిరియన్ వైమానిక దళానికి చెందినదని, బిపిన్ రావత్ ప్రయాణిస్తున్నది కాదని చెప్పారు.

 రావత్, ఆయన భార్య, ఇతర అధికారులు ఎలా మరణించారనే విషయంలో అనుమానాలు వస్తున్నాయని అన్నారు. ఈ ఘటనపై సుప్రీంకోర్టు జడ్జి వంటి వారి చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిపోయిందనే వార్త తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని స్వామి చెప్పారు. ఇది దేశ భద్రతకే పెద్ద హెచ్చరిక అని అన్నారు.

ఈ ఘటనపై తుది నివేదిక రావాల్సి ఉందని... అప్పటి వరకు ఏం చెప్పాలన్నా కష్టమేనని తెలిపారు. తమిళనాడు వంటి ఒక సురక్షిత ప్రాంతంలో హెలికాప్టర్ పేలిపోవడం అనుమానాస్పదమని చెప్పారు. ఈ ఘటనపై కట్టుదిట్టమైన దర్యాప్తు జరగాలని అన్నారు.