airplane: అప్ప‌టికే హెలికాప్ట‌ర్ మంట‌ల్లో కాలిపోతూ క‌న‌ప‌డింది: లోక్‌స‌భ‌లో రాజ్‌నాథ్

  • ప్ర‌మాద స‌మ‌యంలో పెద్ద శ‌బ్దం వ‌చ్చింది
  • స్థానికులు వెళ్లి చూశారు
  • అంద‌రినీ ఆసుప‌త్రుల‌కు త‌ర‌లించారు
  • ఎయిర్ మార్ష‌ల్ మ‌న్వేంద్ర సింగ్ నేతృత్వంలో విచార‌ణ
rajnath on airplane accident

తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య‌ మధులికా రావత్ స‌హా 13 మంది ప్రాణాలు కోల్పోయిన విష‌యం తెలిసిందే. దీనిపై లోక్‌స‌భ‌లో ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ రోజు ప్ర‌క‌ట‌న చేస్తూ ప‌లు వివ‌రాలు తెలిపారు.

  నిన్న మ‌ధ్యాహ్నం 12.08 గంట‌ల‌‌కు రాడార్ నుంచి సంకేతాలు నిలిచిపోయాయ‌ని తెలిపారు. ప్రమాదం జ‌రిగిన స్థ‌లంలో భారీ శ‌బ్దం రావ‌డంతో స్థానికులు అక్క‌డ‌కు వెళ్లార‌ని, అప్ప‌టికే హెలికాప్ట‌ర్ మంట‌ల్లో కాలిపోతూ క‌న‌ప‌డింద‌ని ఆయ‌న వివ‌రించారు.

అనంత‌రం శిథిలాల నుంచి అందిరినీ వెలికితీసి ఆసుప‌త్రికి త‌ర‌లించార‌ని చెప్పారు. మొత్తం 13 మంది చ‌నిపోయార‌ని తెలిపారు. హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో రావ‌త్ స‌హా అంత‌మంది ప్రాణాలు కోల్పోవ‌డం బాధాక‌రమ‌ని అన్నారు. రావత్ అంత్య‌క్రియ‌లు సైనిక లాంఛ‌నాల‌తో జ‌రుగుతాయ‌ని ప్ర‌క‌టించారు. 

హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో వ‌రుణ్ సింగ్ ఒక్క‌రే ప్రాణాల‌తో మిగిలార‌ని చెప్పారు. ఆయ‌న‌కు సైనిక ఆసుప‌త్రిలో చికిత్స కొన‌సాగుతోంద‌ని, ఆయ‌న ప్రాణాలు కాపాడేందుకు ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని తెలిపారు. ఈ ప్రమాద ఘటనపై ఎయిర్ మార్ష‌ల్ మ‌న్వేంద్ర సింగ్ నేతృత్వంలో ఉన్నత స్థాయి విచార‌ణ జ‌రుగుతోంద‌ని వివ‌రించారు. కాగా, రావ‌త్ స‌హా 13 మంది మృతి ప‌ట్ల పార్ల‌మెంటు సంతాపం వ్య‌క్తం చేసింది.

కాగా, అంత‌కుముందు పార్లమెంట్ ప్రాంగ‌ణంలో కేంద్ర మంత్రులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స‌హా రాజ్‌నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్ తదితరులు స‌మావేశ‌మ‌య్యారు. మ‌రోవైపు, రావ‌త్ మృత‌దేహానికి త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి స్టాలిన్ స‌హా ప‌లువురు ప్ర‌ముఖులు నివాళులు అర్పించారు. ప్ర‌స్తుతం వెల్లింగ్ట‌న్‌లోని మ‌ద్రాస్ రెజిమెంట‌ల్ కేంద్రంలో బిపిన్ రావ‌త్ స‌హా 13 మంది మృతదేహాలు ఉన్నాయి.

More Telugu News