'ఆది శంకరాచార్య'గా బాలకృష్ణ?

09-12-2021 Thu 11:14
  • 'అఖండ'గా మెప్పించిన బాలయ్య
  • ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు
  • మరో ఆధ్యాత్మిక చిత్రానికి సన్నాహాలు
  • నిర్మాతగా సి. కల్యాణ్
Balakrishna upcoming movies update
భారతీయ ఆధ్యాత్మిక జీవన విధానంపై ఆది శంకరులవారు ఎంతో ప్రభావం చూపారు. ఆధ్యాత్మిక పరమైన ఎన్నో గ్రంథాలను ఈ లోకానికి అందించారు. అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన ఆయన, అనేక ప్రాంతాలలో పర్యటిస్తూ భక్తిభావ పరిమళాలను వెదజల్లారు. అలాంటి ఆదిశంకరులవారి పాత్రలో బాలకృష్ణ కనిపించనున్నారనే వార్త తాజాగా వినిపిస్తోంది.

బాలకృష్ణతో ఈ సినిమాను నిర్మించాలని అనుకుంటున్నట్టుగా చెప్పింది నిర్మాత సి.కల్యాణ్. ఈ పాత్రను చేస్తే బాలయ్యే చేయాలనీ .. మరో ప్రత్యామ్నాయం లేదని ఆయన అన్నారు. ప్రస్తుతం బాలకృష్ణ ఒప్పుకున్న ప్రాజెక్టులు పూర్తికాగానే ఈ సినిమాను పట్టాలెక్కించే ఆలోచనలో ఉన్నట్టుగా ఆయన చెప్పారు.

సాంఘిక .. జానపద .. పౌరాణిక చిత్రాలు చేయడంలో బాలకృష్ణకి ఎదురులేదు. ఆయితే ఆ కథలకు పూర్తి భిన్నంగా 'ఆది శంకరాచార్య' జీవితం ఉంటుంది. అయితే ఒక సినిమాకి కావలసిన ఆసక్తికరమైన మలుపులు ఎన్నో ఆయన జీవితంలో కనిపిస్తాయి. అందువలన తన ఇమేజ్ ను పక్కన పెట్టేసి బాలయ్య ఈ సినిమాను చేస్తారా? అనేది చూడాలి.