ఆర్థిక అసమానతలు ఎక్కువగా వున్న దేశాల్లో భారత్ .. ఒక్క శాతం జనం చేతిలో 22 శాతం జాతీయ ఆదాయం!

08-12-2021 Wed 10:52
  • కింద స్థాయి 50 శాతం జనాభా ఆదాయం కేవలం 13 శాతం మాత్రమే
  • సంపన్నులతో  కూడిన పేద దేశం భారత్ అన్న వరల్డ్ ఇనీక్వాలిటీ ల్యాబ్
  • భారత్ లో లింగ వివక్ష కూడా ఎక్కువేనని వెల్లడి
India Among Top Nations In Inequality
ఆర్థిక అసమానతల్లో భారత్ ముందువరసలో కొనసాగుతోంది. మన దేశం మొత్తం ఆదాయంలో 22 శాతం కేవలం ఒక్క శాతం మంది చేతిలో ఉంది. వరల్ట్ ఇనీక్వాలిటీ ల్యాబ్ సంస్థ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడయింది. 'వరల్డ్ ఇనీక్వాలిటీ రిపోర్ట్ 2022'లో ఈ సంస్థ సంచలన విషయాలను వెల్లడించింది. ఆర్థిక అసమానతలు అత్యంత ఎక్కువగా ఉండే దేశాల జాబితాలో ఇండియా కూడా ఒకటని తెలిపింది.

ఇండియాలోని వయోజనుల సగటు జాతీయ ఆదాయం రూ. 2,04,200గా ఉందని... అయితే వీరిలో కింద ఉన్న 50 శాతం మంది సగటు ఆదాయం రూ. 53,610 మాత్రమేనని అధ్యయనం వెల్లడించింది. టాప్ 10 శాతం మంది సగటు ఆదాయం రూ. 11,66,520 అని తెలిపింది. దేశ సగటు జాతీయ ఆదాయంలో టాప్ 10 శాతం మంది ఆదాయం 57 శాతమని... టాప్ 1 శాతం మంది ఆదాయం మొత్తం ఆదాయంలో 22 శాతమని తెలిపింది. కింద ఉన్న 50 శాతం మంది ఆదాయం మొత్తం ఆదాయంలో 13 శాతం మాత్రమేనని పేర్కొంది. 'అత్యంత సంపన్నులతో కూడిన పేద దేశం భారత్' అని వ్యాఖ్యానించింది.

1980 దశకం మధ్యలో తీసుకొచ్చిన డీరెగ్యులేషన్, లిబరలైజేషన్ పాలసీలు కొందరి ఆదాయం విపరీతంగా పెరిగిపోయేందుకు దారులు వేశాయని తెలిపింది. ఆర్థిక అసమానతల్లో తీవ్ర స్థాయిలో తేడాలు రావడానికి కూడా ఇవే కారణమని వివరించింది.  

ఇక ఇండియాలో లింగ వివక్ష కూడా చాలా ఎక్కువని పేర్కొంది. సంపాదనలో మహిళా కూలీల వాటా కేవలం 18 శాతమేనని చెప్పింది. ఇది ఆసియా సరాసరి వాటా (21 శాతం) కంటే తక్కువని తెలిపింది. ప్రపంచంలో మహిళా కూలీల సంపాదన తక్కువగా ఉన్న దేశాల్లో ఇండియా ఒకటని చెప్పింది. ఆర్థిక అసమానతలు పెరిగిన దేశాల్లో ఇండియాతో పాటు అమెరికా, రష్యాలు కూడా ఉన్నాయి. యూరోపియన్ దేశాలతో పాటు, చైనాలో కూడా అసమానతలు పెరిగినప్పటికీ... ఆ తేడా స్వల్ప స్థాయిలోనే ఉందని వరల్డ్ ఇనీక్వాలిటీ ల్యాబ్ వెల్లడించింది.