ఐపీఎల్ చాన్స్ వస్తే వదులుకోనంటున్న కివీస్ నయా సంచలనం

07-12-2021 Tue 22:15
  • ఒకే ఇన్నింగ్స్ లో 10 వికెట్లు తీసిన అజాజ్ పటేల్
  • భారత్ పై అరుదైన ఘనత నమోదు
  • ఐపీఎల్ లో ఆడడం గొప్ప అనుభూతి అని వెల్లడి
  • వేలం కోసం వెయిటింగ్ అని వివరణ
Azaz Patel says he never drop a chance to play in IPL
న్యూజిలాండ్ జట్టులో ఇప్పుడు అజాజ్ పటేల్ ఒక సంచలనం. స్పిన్ ఆడడంలో దిట్టలుగా పేరుగాంచిన టీమిండియా ఆటగాళ్లను వరుసబెట్టి తన బుట్టలో వేసుకుని ఒకే ఇన్నింగ్స్ లో 10 వికెట్లు సాధించిన ఘనుడు అజాజ్ పటేల్. అది కూడా భారత్ గడ్డపై ఈ ఫీట్ నమోదు చేయడం విశేషం. కాగా, కాసుల వర్షం కురిపించే ఐపీఎల్ లో ఆడడంపై ఈ భారత సంతతి ఆటగాడు తన మనోభావాలు వెల్లడించాడు.

ఐపీఎల్ లో ఆడే అవకాశం వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోనని స్పష్టం చేశాడు. ఎంతో ఉద్విగ్నత కలిగించే లీగ్ ఐపీఎల్ అని అభివర్ణించాడు. ఐపీఎల్ లో ఆడడాన్ని గొప్ప అనుభూతిగా భావిస్తానని అజాజ్ పటేల్ వెల్లడించాడు. ఐపీఎల్ చాన్స్ కోసం ప్రతి క్రికెటర్ ఎదురుచూసినట్టే తాను కూడా ఎదురుచూస్తున్నానని వివరించాడు. వేలం ప్రక్రియపై ఎంతో ఆసక్తిగా ఉన్నానని తెలిపాడు.