ఏపీ సర్కారు 10 బ్యాంకుల నుంచి రూ.57 వేల కోట్లు అప్పులు చేసింది: కేంద్రం

07-12-2021 Tue 20:05
  • రాజ్యసభలో ప్రశ్నించిన టీడీపీ సభ్యుడు కనకమేడల
  • బదులిచ్చిన కేంద్ర ఆర్థికశాఖ
  • 2019-21 మధ్య బ్యాంకులు రుణాలు ఇచ్చాయని వెల్లడి
  • 40 కార్పొరేషన్లు, సంస్థలకు రుణాలు ఇచ్చాయని వివరణ
Centre replies to TDP member Kanakamedala on AP Govt debts
ఏపీ సర్కారు అప్పులపై టీడీపీ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ రాజ్యసభలో  అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానమిచ్చింది. ఏపీ ప్రభుత్వం 10 బ్యాంకుల నుంచి రూ.57,479 కోట్ల అప్పు చేసిందని కేంద్ర ఆర్థికశాఖ వెల్లడించింది. 2019-21 మధ్య బ్యాంకులు ఈ రుణాలు ఇచ్చినట్టు తెలిపింది. 40 ప్రభుత్వ కార్పొరేషన్లు, సంస్థలకు బ్యాంకులు రుణాలు ఇచ్చాయని వివరించింది.

అత్యధికంగా ఎస్ బీఐ నుంచి 9 సంస్థలు రూ.11,937 కోట్ల రుణం పొందాయని వెల్లడించింది. మరో 5 సంస్థలు బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి రూ.10,865 కోట్ల రుణం తీసుకున్నట్టు తెలిపింది. 3 సంస్థలు బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ.7 వేల కోట్ల రుణం తీసుకున్నట్టు పేర్కొంది. 4 సంస్థలు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నుంచి రూ.2,970 కోట్లు రుణంగా తీసుకున్నట్టు వివరించింది.

యూనియన్ బ్యాంకు నుంచి రూ.6,975 కోట్లు, ఇండియన్ బ్యాంకు నుంచి రూ.5,500 కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి రూ.5.633 కోట్లు, కెనరా బ్యాంకు నుంచి రూ.4,099 కోట్లు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు నుంచి రూ.1,750 కోట్లు, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకు నుంచి రూ.750 కోట్లు రుణంగా తీసుకున్నట్టు తెలిపింది. అసలు, వడ్డీ చెల్లింపు బాధ్యత కార్పొరేషన్లు, సంస్థలదేనని కేంద్రం స్పష్టం చేసింది.