Sara Tendulkar: మోడల్ గా మారిన సచిన్ టెండూల్కర్ కుమార్తె

Sachin Tendulkar daughter Sara turns as model for a clothing brand
  • ఓ దుస్తుల బ్రాండ్ కు మోడలింగ్
  • ఇతర తారలతో ఫొటో షూట్
  • వీడియో షేర్ చేసిన సారా
  • అభిమానుల నుంచి విశేష స్పందన
భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ (24) కొత్త రంగంలోకి అడుగుపెట్టారు. సచిన్ తనయుడు అర్జున్ తండ్రి బాటలో క్రికెట్ ను కెరీర్ గా ఎంచుకోగా, సారా మాత్రం ఉన్నత చదువుల బాటపట్టింది. తాజాగా ఆమె మోడలింగ్ రంగంలోకి ప్రవేశించింది. ఓ ప్రముఖ దుస్తుల బ్రాండ్ కు మోడలింగ్ చేసింది. ఈ దుస్తుల బ్రాండ్ కోసం బనితా సంధు, తాన్యా ష్రాఫ్ వంటి తారలతో కలిసి ఫొటో షూట్ లో పాల్గొంది. దీనికి సంబంధించిన ఓ ప్రోమో వీడియో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.

సాధారణంగా సారా సోషల్ మీడియాలో చేసే పోస్టులకు అభిమానులు విశేషంగా స్పందిస్తుంటారు. ఇప్పుడు మోడల్ గా ఆమె షేర్ చేసిన వీడియో వారిని మరింతగా ఆకట్టుకుంటోంది. సారా టెండూల్కర్ కు ఇన్ స్టాగ్రామ్ లో 1.6 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. సారా క్రమం తప్పకుండా ఫొటోలు, అప్ డేట్లను పంచుకుంటూ అభిమానులను అలరిస్తుంటుంది.

సారా ముంబయిలోని ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో విద్యాభ్యాసం చేసింది. ఆపై ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లి అక్కడి లండన్ యూనివర్సిటీ కాలేజీలో వైద్య విద్యలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. తల్లి అంజలి కూడా వైద్యురాలే కావడంతో సారా కూడా ఆమె బాటలోనే వైద్య వృత్తిని ఎంచుకుంది. అంతేకాదు, సచిన్ తనయ ఫిట్ నెస్ కు ఎంతో ప్రాధాన్యత ఇస్తుంది. సోషల్ మీడియాలో తన ఫిట్ నెస్ వర్కౌట్లకు సంబంధించిన ఫొటోలను కూడా పోస్టు చేస్తుంటుంది.

ఇక, సెలబ్రిటీలకు, రూమర్లకు అవినాభావ సంబంధం ఉంటుందన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సచిన్ కుమార్తె సారాపైనా కొన్ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. టీమిండియా క్రికెటర్ శుభ్ మాన్ గిల్ తో సారా అనుబంధంపై సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో ఒకరి పోస్టులకు మరొకరు స్పందిస్తుండడంతో రూమర్ సృష్టికర్తలు మరింత చెలరేగిపోతుంటారు.
Sara Tendulkar
Sachin Tendulkar
Model
Clothing Brand

More Telugu News