వసతి గృహాల్లో కరోనా కేసులు పెరుగుతుండడంపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందన

07-12-2021 Tue 19:13
  • హాస్టళ్లలో కరోనా కలకలం
  • స్కూళ్లలో పెద్దగా కేసులు రావడంలేదని వెల్లడి
  • ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నామని స్పష్టీకరణ
  • అందరూ వ్యాక్సిన్లు తీసుకోవాలని పిలుపు
Sabitha Indrareddy responds to corona cases in hostels
తెలంగాణలో పలు వసతి గృహాల్లో కరోనా కేసులు వెలుగుచూస్తుండడం పట్ల రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. రాష్ట్రంలోని స్కూళ్లలో కరోనా కేసులు పెద్దగా నమోదు కావడంలేదని తెలిపారు. అయితే హాస్టళ్లలో అక్కడక్కడా కేసులు నమోదవుతున్నాయని అన్నారు. కేసులు పెరిగితే ప్రభుత్వం సమీక్షించి తగు నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు.

కరోనా కారణంగా విద్యార్థులు ఇప్పటికే నష్టపోయారని, విద్యార్థుల భవిష్యత్ పై ప్రభావం పడకుండా చర్యలు తీసుకుంటామని సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటూ, ఎన్నో జాగ్రత్తలతో పాఠశాలలు నడుపుతున్నామని స్పష్టం చేశారు. బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని పిలుపునిచ్చారు.