కొబ్బరికాయ కొడితే రోడ్లు పగిలిపోతున్నాయి... బీజేపీ సాధించిన అభివృద్ధి ఇదే!: అఖిలేశ్ వ్యంగ్యం

07-12-2021 Tue 18:18
  • యూపీ అధికార పక్షంపై అఖిలేశ్ విమర్శలు
  • అభివృద్ధిపై సీఎంను నిలదీసిన సమాజ్ వాదీ పార్టీ చీఫ్
  • ప్రజల్లో బీజేపీపై తీవ్ర వ్యతిరేకత ఉందని వ్యాఖ్య 
  • ఈసారి ఎన్నికల్లో 400 సీట్లలో ఓటమి ఖాయమని కామెంట్  
Akhilesh Yadav satires on BJP govt in Uttar Pradesh
సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ యూపీ అధికార పక్షం బీజేపీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రోడ్డుపై కొబ్బరికాయ కొడితే కొబ్బరికాయ పగిలిపోవడం పాత సంప్రదాయం అని, కానీ రోడ్డుపై కొబ్బరికాయ కొడితే రోడ్డే పగిలిపోవడం కొత్త సంప్రదాయం అని ఎద్దేవా చేశారు. ఇదే బీజేపీ సాధించిన అభివృద్ధి అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. రాష్ట్రంలో తప్పుడు పాలన సాగుతోందని, ఉద్యోగాలు, విద్యారంగం అభివృద్ధి, రైతుల సమస్యలపై ప్రభుత్వం తిరోగమనంలో వెళుతోందని విమర్శించారు.

లఖింపూర్ లో రైతులపైకి జీపు దూసుకెళ్లినప్పుడు జీపులో ఉన్నది కేంద్రమంత్రి కుమారుడో, కాదో ముఖ్యమంత్రి బదులివ్వాలని అఖిలేశ్ డిమాండ్ చేశారు. ప్రజల్లో బీజేపీ అంటే తీవ్ర ఆగ్రహం నెలకొని ఉందని, ఈసారి ఎన్నికల్లో 400 సీట్లలో పరాజయం ఖాయం అని స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్ పశ్చిమ ప్రాంతంలో బీజేపీ నామరూపాల్లేకుండా పోతుందని అన్నారు. మధురలో ఓ సభలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.