ఫేస్ బుక్ పై రూ.10 లక్షల కోట్లకు దావా వేసిన రోహింగ్యాలు

07-12-2021 Tue 17:59
  • మయన్మార్ లో రోహింగ్యాలపై తీవ్ర హింస
  • దేశం విడిచి పారిపోయిన రోహింగ్యాలు
  • పలు దేశాల్లో శరణార్థులుగా జీవిస్తున్న వైనం
  • తాజాగా శాన్ ఫ్రాన్సిస్కో కోర్టులో పిటిషన్
Rohingyas files law suit against social media giant
మయన్మార్ లో తీవ్ర అణచివేతకు గురై, ప్రపంచంలోని పలు దేశాలకు శరణార్థులుగా వెళ్లిన రోహింగ్యాలు ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్ బుక్ పై శాన్ ఫ్రాన్సిస్కో న్యాయస్థానంలో దావా వేశారు. రోహింగ్యా శరణార్థుల తరఫున బ్రిటన్ లీగల్ సర్వీసెస్ సంస్థలు ఫీల్డ్స్ పీఎల్ఏసీ, ఎడెల్సన్ పీసీ పిటిషన్ దాఖలు చేశాయి. మయన్మార్ లో తమపై హింసకు ఫేస్ బుక్కే కారణమని వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తమకు వ్యతిరేకంగా జరిగిన విషప్రచారం ఫేస్ బుక్ వేదికగానే నడించిందని, ఆ విద్వేష ప్రచారాన్ని అడ్డుకోవడంలో ఫేస్ బుక్ విఫలమైందని రోహింగ్యాలు ఆరోపించారు. తద్వారా తమ వర్గం తీవ్రస్థాయిలో హింసకు గురైందని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపరిహారం రూపేణా తమకు ఫేస్ బుక్ రూ.10 లక్షల కోట్ల రూపాయలు చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని వారు కోరారు.

2017లో మయన్మార్ లో తీవ్ర హింస ప్రజ్వరిల్లగా, 7.5 లక్షల మంది రోహింగ్యాలు ప్రాణాలు చేతబట్టుకుని దేశం విడిచి వెళ్లిపోయారు. ఈ పరిస్థితికి ఫేస్ బుక్ లో జరిగిన ప్రచారమే కారణమని వారు ఆరోపిస్తున్నారు. 2018లో ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల దర్యాప్తు బృందం కూడా ఫేస్ బుక్ ప్రచారమే హింసకు దారితీసిందని నిర్ధారించిందంటూ రోహింగ్యాలు తమ పిటిషన్ లో తెలియజేశారు. కాగా, రోహింగ్యా శరణార్థులు కోర్టును ఆశ్రయించడంపై ఫేస్ బుక్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.