జోరు తగ్గని 'అఖండ' .. 5వ రోజు వసూళ్లు ఇవిగో!

07-12-2021 Tue 17:39
  • ఈ నెల 2న విడుదలైన 'అఖండ'
  • థియేటర్లలో కొనసాగుతున్న సందడి
  • బాక్సాఫీస్ దగ్గర భారీవసూళ్లు
  • హ్యాట్రిక్ హిట్ తెచ్చి పెట్టిన సినిమా  
Akhanda movie update
బాలకృష్ణ నుంచి సరైన హిట్ లేక చాలా కాలమైంది. బోయపాటి కాంబినేషన్లో అనే సరికి ఈ సారి అంతా ఆశలు పెట్టుకున్నారు.'అఖండ' నుంచి అప్ డేట్స్ మొదలైన తరువాత ఈ సినిమా తప్పుకుండా హిట్ కొడుతుందనే అభిప్రాయాలు బలంగా వినిపించాయి. అనుకున్నట్టుగానే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని నమోదు చేసింది.

మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 2వ తేదీన థియేటర్లకు వచ్చింది. తొలి ఆటతోనే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతూ దూసుకుపోతోంది. వీకెండ్ లో రికార్డుస్థాయి వసూళ్లను దక్కించుకున్న ఈ సినిమా, ఆ తరువాత రోజు కూడా వసూళ్ల విషయంలో నిలకడగా ఉండటం విశేషం.

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 5వ రోజున 3.48 కోట్ల షేర్ ను వసూలు చేసింది. ఒక్క నైజామ్ లోనే ఈ సినిమా ఆ రోజున కోటి రూపాయలకి  పైగా సాధించింది. ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో ప్రధానమైన విలన్ గా శ్రీకాంత్ నటించగా, మరో విలన్ గా నితిన్ మెహతా నటించాడు. మొత్తానికి ఈ ఏడాది చివరిలో బాలయ్య .. బోయపాటి హ్యాట్రిక్ కొట్టారు.