నాగబాబును కలిసి ఆశీస్సులు అందుకున్న బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక

07-12-2021 Tue 17:02
  • బిగ్ బాస్ ఐదో సీజన్ లో అందరినీ అలరించిన పింకీ
  • గతవారం ఎలిమినేషన్
  • ఎంతో ఎదిగావంటూ అభినందించిన నాగబాబు
  • చాలామందికి ఆత్మవిశ్వాసం అందించావని కితాబు
Bigg Boss fame Priyanka Singh met Nagababu
బిగ్ బాస్ ఐదో సీజన్ లో పాల్గొని ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ప్రియాంక సింగ్ అలియాస్ పింకీ గతవారం ఎలిమినేట్ అయింది. ట్రాన్స్ జెండర్ గా బిగ్ బాస్ ఇంట్లో ప్రవేశించిన ప్రియాంక... ఇంటి సభ్యులందరి మనసు దోచుకోవడమే కాదు, తెలుగు రాష్ట్రాల ప్రజలకు బాగా దగ్గరైంది.

కాగా, ఎలిమినేషన్ అనంతరం ప్రియాంక మెగాబ్రదర్ నాగబాబును కలిసింది. ఈ సందర్భంగా నాగబాబు ఆమెను అభినందించారు. లెక్కలేనన్ని ప్రతికూల పరిస్థితులను, విమర్శలను దాటుకుని ఈ స్థాయికి ఎదిగావంటూ ప్రియాంకను కొనియాడారు. ప్రజల హృదయాల్లో ప్రియాంక స్థానం సంపాదించుకున్న తీరు ప్రశంసనీయం అని పేర్కొన్నారు. ప్రియాంక బిగ్ బాస్ టైటిల్ గెలవకపోయినా, ఆమె లాంటి ఎంతోమందికి ఆత్మవిశ్వాసం అందించారని నాగబాబు తెలిపారు. ఎప్పటికీ ప్రియాంకకు తన ప్రేమ, మద్దతు ఉంటాయని స్పష్టం చేశారు.

బిగ్ బాస్ ఇంట్లో ఉన్నప్పుడు సహ కంటెస్టెంట్ మానస్ తో ఎంతో చనువుగా ఉన్న పింకీ... బయటికి వచ్చిన తర్వాత కూడా మానస్ కు మద్దతు కొనసాగిస్తోంది. మానస్ కు ఓట్ చేయాలంటూ ఇన్ స్టాగ్రామ్ వేదికగా అభిమానులకు పిలుపునిచ్చింది. ప్రియాంకకు ఇన్ స్టాలో దాదాపు 2 లక్షల మంది ఫాలోవర్లు ఉండడం విశేషం.