Ravichandran Ashwin: అజాజ్ పటేల్ అకౌంట్ కు బ్లూటిక్ ఇవ్వాలంటూ ట్విట్టర్ కు సిఫారసు చేసిన అశ్విన్

  • ఒకే ఇన్నింగ్స్ లో 10 వికెట్లు తీసిన అజాజ్
  • ట్విట్టర్ లో సాధారణ వ్యక్తిలానే ఉన్న కివీస్ స్పిన్నర్
  • అజాజ్ ఘనతను ట్విట్టర్ కు వివరించిన అశ్విన్
  • అజాజ్ అకౌంట్ కు బ్లూటిక్ ఇచ్చిన ట్విట్టర్
Ashwin urged Twitter to verify Azaz Patel account

కొన్నిరోజులుగా క్రికెట్ ప్రపంచంలో న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ పేరు మార్మోగుతోంది. అజాజ్ పటేల్ టీమిండియాపై ఒకే ఇన్నింగ్స్ లో 10 వికెట్లు తీసి అరుదైన ఘనత సాధించాడు. తద్వారా దిగ్గజ బౌలర్లు జిమ్ లేకర్, అనిల్ కుంబ్లేల సరసన నిలిచాడు.

అయితే, అజాజ్ పటేల్ కు ట్విట్టర్ అకౌంట్ ఉన్నప్పటికీ, దానికి ట్విట్టర్ వెరిఫైడ్ మార్క్ బ్లూటిక్ లేదు. ఈ విషయాన్ని గుర్తించిన టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ట్విట్టర్ కు సిఫారసు చేశాడు. అజాజ్ పటేల్ ఖాతాకు బ్లూటిక్ ఇవ్వాలంటూ ట్విట్టర్ వెరిఫైడ్ విభాగానికి సూచించాడు. ఒకే ఇన్నింగ్స్ లో 10కి 10 వికెట్లు తీసిన అజాజ్ పటేల్ ఇప్పుడు ఓ సెలబ్రిటీ బౌలర్ అని ట్విట్టర్ వెరిఫైడ్ విభాగం దృష్టికి తీసుకెళ్లాడు.

అశ్విన్ విజ్ఞప్తిని పరిశీలించిన ట్విట్టర్ వెరిఫైడ్ వెంటనే అజాజ్ పటేల్ అకౌంట్ ను సమీక్షించి బ్లూటిక్ ఇచ్చింది. దీనిపై స్పందించిన అశ్విన్ ట్విట్టర్ వెరిఫైడ్ విభాగానికి కృతజ్ఞతలు తెలిపాడు. ఇటీవలి వరకు అజాజ్ పటేల్ ఓ సాధారణ బౌలర్ గానే ఉన్నాడు. టీమిండియాతో టెస్టు సిరీస్ సందర్భంగా ఒక్కసారిగా ఫేమస్ అయ్యాడు. ప్రస్తుతం అతని ట్విట్టర్ అకౌంట్ కు 20 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు.

More Telugu News