రఘురామపై ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నాయి... ఎందుకు పార్టీలో చేర్చుకున్నారు?: వైసీపీకి సోము వీర్రాజు సూటి ప్రశ్న

07-12-2021 Tue 14:17
  • రఘురామ బీజేపీలోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాడన్న మిథున్ రెడ్డి
  • స్పందించిన సోము వీర్రాజు
  • రఘురామ 2014కి ముందు వైసీపీలోనే ఉన్నాడని వెల్లడి
  • 2019లో మళ్లీ ఆ పార్టీలోకే వచ్చాడని వివరణ
Somu Veerraju questions YCP over Raghurama Krishnaraju issue
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అంశంలో ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు వైసీపీ నేతలను సూటిగా ప్రశ్నించారు. రఘురామకృష్ణరాజు బీజేపీలో చేరే ప్రయత్నం చేస్తున్నాడంటూ ఓ ఎంపీ పార్లమెంటులో మాట్లాడాడని అన్నారు. రఘురామకృష్ణరాజు అవినీతిపరుడని, బ్యాంకు రుణాల ఎగవేతకు పాల్పడిన వ్యక్తి అని, ఆయనపై చర్యలు తీసుకోవాలని తాము కేంద్రాన్ని కోరామని ఆ ఎంపీ ప్రస్తావించినట్టు సోము తెలిపారు.

"రఘురామకృష్ణరాజు అవినీతిపరుడు అయితే ఆయనకు సీటు ఎందుకు ఇచ్చారని అడుగుతున్నా. ఈ అవినీతి అంతా ఆయన ఈ మధ్యకాలంలోనే చేశాడా? 2014కి ముందు ఆయన మీ పార్టీలోనే ఉన్నారు. 2014లో బీజేపీలో చేరారు. కానీ మేం రఘురామకు సీటివ్వలేదు, గంగరాజుకు ఇచ్చాం. ఇవాళ మీరు ఆయనపై చేస్తున్న అవినీతి ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నాయి. 2019లో మీరే ఆయనను పార్టీలో చేర్చుకుని మరీ సీటిచ్చారు. మేం ఎందుకివ్వలేదు... మీరు ఎందుకిచ్చారు? ఒకసారి ఆలోచించండి" అంటూ సోము వీర్రాజు మీడియా సమావేశంలో పేర్కొన్నారు.

వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి పార్లమెంటు సమావేశాల్లో రఘురామపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. సీబీఐ కేసుల నుంచి తప్పించుకునేందుకు రఘురామ అధికార బీజేపీలోకి వెళుతున్నాడంటూ ఆరోపణలు చేశారు.