త్రివిధ దళాల్లో పనిచేసిన ఏకైక వీరుడు ప్రీతిపాల్ సింగ్ ఇకలేరు!

07-12-2021 Tue 14:13
  • అనారోగ్యంతో కన్నుమూసిన ప్రీతిపాల్ సింగ్ గిల్
  • మరో 4 రోజులైతే 101వ పుట్టినరోజు
  • ఇంతలోనే కన్నుమూత
  • తుపాకీ పేల్చడంలో నైపుణ్యం
The Army Veteran Who Worked In All Three Defense Units Died
మామూలుగా అయితే ఓ సైనికుడు ఏదో ఒక రక్షణ విభాగంలో మాత్రమే పనిచేస్తుంటారు. సైన్యంలోనో.. నావికాదళంలోనో.. లేదంటే వైమానిక దళంలోనో సేవలందిస్తారు. కానీ, ఆ మూడు దళాల్లోనూ (త్రివిధ దళాలు) ఒకే వ్యక్తి పనిచేయడం.. దాదాపు అసాధ్యమే. ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన సైనికాధికారే కర్నల్ ప్రీతిపాల్ సింగ్ గిల్. అవును, త్రివిధ దళాల్లో పనిచేసిన ఏకైక సైనికుడిగా ఆయన చరిత్ర సృష్టించారు.

అయితే, అంతటి ఘన చరిత్ర ఉన్న సైనికుడు ఇకలేరు. వందేళ్లు నిండా బతికిన ఆయన ఆదివారం మధ్యాహ్నం హర్యానాలోని చండీగఢ్ లో ఉన్న తన నివాసంలో తుది శ్వాస విడిచారు. మరో 4 రోజుల్లో (డిసెంబర్ 11) 101వ పుట్టినరోజును జరుపుకోవాల్సి ఉంది. అయితే, కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూశారు. రెండో ప్రపంచం యుద్ధంలోనూ ఆయన పాల్గొన్నారు. అప్పట్లో బ్రిటన్ కు అనుసంధానంగా ఉన్న రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్, రాయల్ ఇండియన్ నేవీలో పనిచేశారు. ఆ తర్వాత భారత సైన్యంలోనూ విధులు నిర్వర్తించారు.

లాహోర్ లోని (అవిభాజ్య భారత్) గవర్నమెంట్ కాలేజ్ లో డిగ్రీ పూర్తి చేసిన ఆయన.. అక్కడే వాల్టన్ ఏరోడ్రోమ్ లో రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో చేరారు. హొవార్డ్ ఎయిర్ క్రాఫ్ట్ పై కరాచీలో శిక్షణ తీసుకున్నారు. అయితే, అది అంత సురక్షితం కాదని భావించి.. ఆయన తండ్రి మేజర్ హర్పాల్ సింగ్ గిల్ అది మాన్పించేశారు. ఆ తర్వాత నేవీలో చేరారు. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో కార్గో షిప్ లకు ఎస్కార్ట్ గా వెళ్లే ఐఎన్ఎస్ తీర్ నౌకలో పనిచేశారు.

లాంగ్ రేంజ్ గన్నరీ కోర్స్ పూర్తయిన తర్వాత నేవీ నుంచి ఆయన బయటకొచ్చేశారు. ఆ తర్వాత గ్రేడెడ్ ఇన్ స్ట్రక్టర్ గన్నరీగా చేరారు.  స్వాతంత్ర్యం వచ్చిన కొన్నాళ్లకే గిల్ భారత ఆర్మీలో చేరారు. 1 సిక్ (ఇప్పటి 4 మెక్) రెజిమెంట్ లో డ్యూటీ చేశారు. తుపాకీ పేల్చడంలో నైపుణ్యం ఉండడంతో రెజిమెంట్ ఆఫ్ ఆర్టిలరీలోని గ్వాలియర్ మౌంటెయిన్ బ్యాటరీలోకి డ్యూటీ మార్చారు.