బోయపాటిపై దృష్టి పెట్టిన చిరంజీవి?

07-12-2021 Tue 11:50
  • అఖండ'తో హిట్ కొట్టిన బోయపాటి
  • నెక్స్ట్ మూవీ అల్లు అర్జున్ తో
  • త్వరలో సెట్స్ పైకి వెళ్లే దిశగా పనులు
  • వచ్చే ఏడాదిలో చిరూతో చర్చలు
Chiranjeevi in Boyapati Movie
బోయపాటి తన కెరియర్ ను మొదలుపెట్టిన దగ్గర నుంచి, యాక్షన్ కీ .. ఎమోషన్ కి పెద్ద పీట వేస్తూ వచ్చాడు. అప్పుడప్పుడు పరాజయాలు ఎదురైనా, ఆయన తన మార్కును వదిలిపెట్టలేదు .. తన ట్రాక్ మార్చుకోలేదు.'వినయ విధేయ రామా' సినిమా ఒక రకంగా బోయపాటి కెరియర్ ని దెబ్బకొట్టే ప్రయత్నం చేసింది.

కానీ తెలివైనవాడు కావడం వలన కాస్త ఆలస్యమైనా వెంటనే తేరుకున్నాడు. ఆ సినిమా విషయంలో జరిగిన పొరపాట్లు 'అఖండ' విషయంలో జరగకుండా చూసుకున్నాడు. అనూహ్యమైన విజయాన్ని సొంతం చేసుకున్నాడు. తన తదుపరి సినిమాను అల్లు అర్జున్ తో చేయడానికి రంగాన్ని సిద్ధం చేసుకుంటున్నాడు.

అయితే 'వినయ విధేయ రామా' సమయంలోనే, తనకి బోయపాటితో కలిసి ఒక సినిమా చేయాలనుందని చిరంజీవి అన్నారు. ఆ సినిమా పరాజయంపాలు కావడం వలన ఆలోచనలోపడిన చిరంజీవి, ఇప్పుడు మళ్లీ బోయపాటితో ఒక సినిమా చేస్తే బాగుంటుందనే ఆలోచన చేస్తున్నట్టు చెబుతున్నారు. వచ్చే ఏడాదిలో ఇందుకు సంబంధించిన చర్చలు జరగవచ్చని అనుకుంటున్నారు.