ఇల్లు కట్టుకోవాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సిమెంట్ ధరలను తగ్గించిన కంపెనీలు

07-12-2021 Tue 11:49
  • తెలుగు రాష్ట్రాల్లో రూ.40 దాకా తగ్గింపు
  • దేశంలో ఒక్కో బస్తాపై రూ.20–రూ.40 వరకు కోత
  • డిమాండ్ లేకపోవడంతో సంస్థల నిర్ణయం
Cement Companies Reduced Prices On Cement Bags
సొంతిల్లు.. ప్రతి ఒక్కరి కల. కానీ, భూముల ధరలతో పాటు ఇంటి నిర్మాణానికి అవసరమయ్యే సామగ్రి ధరలేమో ఆకాశాన్నంటాయి. ఓ సామాన్యుడికి అందనంత ఎత్తులో ఉన్నాయి. దీంతో చాలా మందికి ఆ కల కలగానే మిగిలిపోతోంది. అయితే, కరోనా వల్ల గత రెండేళ్లలో నిర్మాణ రంగం నెమ్మదించింది. ఇప్పుడిప్పుడే కుదుటపడుతోంది. ఈ నేపథ్యంలో సిమెంట్ వంటి వస్తువులకు గిరాకీ తగ్గిపోయింది. దీంతో ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి చిన్న ఊరటనిస్తూ సంస్థలు సిమెంట్ పై ధరలను తగ్గించాయి. 50 కిలోల బస్తాపై రూ.20 నుంచి రూ.40 వరకు తగ్గించేశాయి.

తెలుగు రాష్ట్రాల్లో రూ.40 తగ్గింది. తమిళనాడులో రూ.20 వరకు తగ్గగా, కేరళ, కర్ణాటకల్లో రూ.20 నుంచి రూ.40 మధ్య తగ్గినట్టు డీలర్లు చెబుతున్నారు. ధరల తగ్గుదలతో తెలుగు రాష్ట్రాల్లో ఒక్కో బస్తా ధర రూ.280 నుంచి రూ.320 వరకు లభించనుంది. ఓ టాప్ కంపెనీకి చెందిన సిమెంట్ బస్తా ధర తమిళనాడులో రూ.400 కన్నా తక్కువకు దిగొచ్చిందని డీలర్లు చెబుతున్నారు. బ్రాండ్ ను బట్టి కర్ణాటకలో రూ.360 నుంచి 400 మధ్య, కేరళలో రూ.340 నుంచి రూ.380 మధ్య సిమెంట్ బస్తా ధరలున్నాయంటున్నారు.

అల్ట్రాటెక్, అంబుజా, ఇండియా సిమెంట్స్, రామ్ కో, సాగర్ సిమెంట్స్, చెట్టినాడ్, హెడల్ బర్గ్, ఎన్ సీఎల్ ఇండస్ట్రీస్, దాల్మియా భారత్, ఓరియంట్ సిమెంట్స్, శ్రీ సిమెంట్ వంటి సంస్థలు ధరలను తగ్గించాయని చెబుతున్నారు. వాస్తవానికి సంస్థలు నవంబర్ చివర్లో ధరలను పెంచాలని ముందుగా అనుకున్నాయి. అయితే, ఆశించినంత డిమాండ్ లేకపోవడం, డీలర్లు వ్యతిరేకించడంతో సంస్థలు ఆ నిర్ణయాన్ని విరమించుకున్నాయి.

దక్షిణాది రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన వర్షాలతో డిమాండ్ భారీగా పడిపోయింది. ఇటు హైదరాబాద్ లో కట్టిన ఇళ్లే ఇంకా చాలా వరకు అమ్ముడుపోని పరిస్థితి ఉంది. దీంతో కొత్త నిర్మాణాలు తగ్గాయంటున్నారు. జనవరి లేదా ఫిబ్రవరి మధ్యలో మళ్లీ నిర్మాణాల జోరు పెరిగి ఇళ్లకు డిమాండ్ పెరిగే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.