కత్రినాకైఫ్–విక్కీ కౌశల్ వివాహం.. లైవ్ ప్రసారానికి రూ.100 కోట్లు ఆఫర్ చేసిన ప్రముఖ ఓటీటీ!

07-12-2021 Tue 11:30
  • ఎల్లుండే వివాహం
  • ఆఫర్ పై ఇంకా తేల్చుకోని జంట
  • లైవ్ లో అతిథుల ఇంటర్వ్యూలు
OTT Offered Rs 100 Crore To Katrina and Vicky For their Wedding Live Telecast
బాలీవుడ్ లో ప్రస్తుతం కత్రినా కైఫ్–విక్కీ కౌశల్ ల వివాహం హాట్ టాపిక్. వీరిద్దరూ మూడు ముళ్ల బంధంతో ఒక్కటవుతారంటూ రెండు మూడు నెలలుగా తెగ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వాటన్నింటినీ నిజం చేస్తూ కొన్ని రోజుల క్రితమే అధికారిక ప్రకటన చేశారిద్దరు. మరో రెండు రోజుల్లో (డిసెంబర్ 9 – గురువారం) వీరు దంపతులు కాబోతున్నారు. వారి పెళ్లికి అతిరథ మహారథులను ఆహ్వానించారు. వారందరికీ కోడ్ నేమ్స్ ఇచ్చినట్టూ ప్రచారం జరుగుతోంది.

అయితే, అందరూ అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న వారి పెళ్లిపై ఇప్పుడో మరో గుసగుస వినిపిస్తోంది. వాళ్లిద్దరి వివాహ వేడుకను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఓ పెద్ద ఓటీటీ సంస్థ బంపరాఫర్ ను ప్రకటించినట్టు బాలీవుడ్ వర్గాల టాక్. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ.100 కోట్లు ఇస్తామంటూ కత్రిన, విక్కీలతో సదరు ఓటీటీ చర్చలు జరిపిందట.

‘‘పాశ్చాత్య దేశాల్లో సెలెబ్రిటీలు తమ పెళ్లిళ్లకు సంబంధించిన ప్రసారాలను అమ్ముకోవడం సర్వసాధారణం. మేగజీన్లు, చానెళ్లకు వీడియోలు, ఫొటోలు ఇస్తుంటారు. తమ అభిమాన తారల పెళ్లిని ఏ అభిమాని మాత్రం చూడాలనుకోడూ! ఇప్పుడు భారత్ లోనూ అదే ట్రెండ్ తీసుకొచ్చేందుకు ఓ ఓటీటీ ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ లకు రూ.100 కోట్లు ఆఫర్ చేసింది’’ అని ఈ విషయం గురించి తెలిసిన అత్యంత విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

అయితే, ఇప్పటిదాకా కత్రిన–విక్కీల జంట మాత్రం ఆ ఆఫర్ కు ఓకే చెప్పలేదని తెలుస్తోంది. వాళ్లు ఓకే అనడమే ఆలస్యం వారి పెళ్లికి సంబంధించిన ప్రతి క్షణాన్ని లైవ్ ప్రసారం చేస్తారని అంటున్నారు. లైవ్ ప్రసారంలో భాగంగా పెళ్లి లైవ్ ఫుటేజి, పెళ్లికి వచ్చిన అతిథులు, తారలు, కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు, స్టైలిస్టుల చిట్టిపొట్టి ఇంటర్వ్యూల వంటి వాటిని టెలికాస్ట్ చేస్తారని చెబుతున్నారు. కాగా, గతంలో అదే ఓటీటీ.. దీపికా పదుకొణే, రణ్ వీర్ సింగ్ ల వివాహానికీ సేమ్ ఆఫర్ ఇచ్చింది. అయితే, అప్పట్లో ఆ జంట దానికి సున్నితంగా నో చెప్పేసిందట. మరి, ఇప్పుడు కత్రిన–విక్కీ జంట అందుకు ఒప్పుకొంటుందా? అన్నది వేచి చూడాలి.