Etela Rajender: ఈటలను ఎదుర్కోవడానికి కేసీఆర్ సిద్ధంగా ఉండాలి: ఈటల భార్య జమున

  • జిల్లా కలెక్టర్ పై కేసులు పెడతాం
  • మహిళనైన నన్ను కేసీఆర్ వేధించడం సబబు కాదు
  • ఈటలను రోడ్డు మీదకు తేవాలని ప్రయత్నిస్తున్నారు
Etela Rajender wife Jamuna response on District collectors allegations on land grabbing

బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ కుటుంబానికి చెందిన జమునా హేచరీస్ సంస్థ 70.33 ఎకరాల అసైన్డ్ భూములను కబ్జా చేసిన సంగతి నిజమేనని మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్ నిన్న మీడియా సమావేశంలో వెల్లడించిన సంగతి తెలిసిందే.

ఈ వ్యాఖ్యలపై ఈటల భార్య జమున తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు ప్రకటన చేసిన ఆ జిల్లా కలెక్టర్ పై కచ్చితంగా కేసులు పెడతామని ఆమె తెలిపారు. జిల్లా కలెక్టర్ ఉద్యోగానికి రాజీనామా చేసి, గులాబీ కండువా కప్పుకుంటే బాగుంటుందని అన్నారు. తమ వ్యాపారాలకు అనుమతులు ఇవ్వొద్దని ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టు సాక్షాత్తు అధికారులే చెపుతున్నారని అన్నారు. తమ స్థలంలో పెద్ద షెడ్లు వేసుకుంటే తప్పేముందని ప్రశ్నించారు.

తన భర్త టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ప్రభుత్వ పెద్దలు ఒకలా వ్యవహరించారని... టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మరోలా ఉన్నారని జమున విమర్శించారు. టీఆర్ఎస్ కు చెందిన చాలా మంది మంత్రుల పౌల్ట్రీ ఫాంలకు పొల్యూషన్ సర్టిఫికెట్స్ ఉన్నాయా? అని ప్రశ్నించారు. మహిళా సాధికారత గురించి మాట్లాడే ముఖ్యమంత్రి కేసీఆర్ తనను వేధించడం ఎంత వరకు సబబని అడిగారు.

హుజూరాబాద్ ఉపఎన్నికలో వచ్చిన ఫలితాలే వచ్చే ఎన్నికల్లో అన్ని చోట్ల రిపీట్ అవుతాయని... ఎదుర్కోవడానికి కేసీఆర్ సిద్ధంగా ఉండాలని జమున అన్నారు. రానున్న రోజుల్లో మొత్తం 33 జిల్లాల్లో ఈటల పర్యటిస్తారని చెప్పారు. ఈటలను ఎదుర్కోవడానికి మంత్రి కేసీఆర్ సిద్ధంగా ఉండాలని అన్నారు. తెలంగాణ ఉద్యమం కోసం సొంత భూములను కూడా అమ్ముకున్న చరిత్ర తమదని చెప్పారు. హుజూరాబాద్ ఓటమిని జీర్ణించుకోలేక ఈటలను రోడ్డు మీదకు తేవాలని ప్రయత్నిస్తున్నారని... అది సాధ్యమయ్యే పని కాదని అన్నారు.

More Telugu News