ఏపీలో చెలరేగిపోతున్న చెడ్డీగ్యాంగ్.. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే విల్లాల్లోకి చొరబాటు

07-12-2021 Tue 09:13
  • ఒకటో తేదీ నుంచి వరుస దోపిడీలు
  • తణుకు ఎమ్మెల్యే కారుమూరి, చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి, ఓ వ్యాపారి విల్లాల్లోకి చొరబాటు
  • సీఎం నివాసానికి కిలోమీటరు దూరంలో విల్లాలు
Cheddi Gang Enters MLA and Former MLA Villas
ఏపీలో చెడ్డీ గ్యాంగ్ చెలరేగిపోతోంది. ఈ నెల 1న అర్ధరాత్రి కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లిలో ఓ అపార్ట్‌మెంట్‌లో చోరీకి యత్నించిన చెడ్డీగ్యాంగ్.. ఈ నెల 3న తాడేపల్లిలో ముఖ్యమంత్రి జగన్ నివాసానికి కిలోమీటరు దూరంలో ఉన్న నవోదయ కాలనీలోని రెయిన్‌బో విల్లాల్లోకి ప్రవేశించినట్టు సీసీ కెమెరాల్లో రికార్డయింది. చెడ్డీగ్యాంగ్‌కు చెందిన వారిగా భావిస్తున్న ఐదుగురు దుండగులు గడ్డపారలతో తలుపులు పగలగొట్టి 37, 39, 44 నంబరు విల్లాల్లోకి చొరబడ్డారు. ఇవి తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు, చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌, ఓ వ్యాపారికి సంబంధించిన విల్లాలు.

తలుపులు పగలగొట్టి లోపలికి ప్రవేశించిన దుండగులు అక్కడ ఏమీ లభించకపోవడంతో వస్తువులను చిందరవందర చేసి వెళ్లిపోయారు. అయితే, ఈ ఘటనపై నిన్నటి వరకు ఎవరూ ఫిర్యాదు చేయనప్పటికీ సీసీ టీవీ కెమెరాలో రికార్డయిన దృశ్యాల ఆధారంగా పోలీసులు ఈ విషయాన్ని గుర్తించారు. కాగా, అంతకుముందు రోజు కూడా ఈ ముఠా కుంచనపల్లిలోని ఓ అపార్ట్‌మెంట్‌లోకి చొరబడి రూ. 4 వేలు దోచుకుంది.

ఈ గ్యాంగులో ఉన్న ఐదుగురు సభ్యులు చెడ్డీలు, తలపాగాలు ధరించి ఉన్నారు. చేతిలో మారణాయుధాలు ఉన్నాయి. కాగా, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉండే నవోదయ కాలనీలోకి ముఠా ప్రవేశించడం ఆందోళన కలిగిస్తోంది. భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ఘటనపై అన్ని కోణాల్లోనూ విచారణ జరుపుతున్నట్టు గుంటూరు పోలీసులు తెలిపారు.