East Godavari District: నా మాట వినలేదో.. చీరేస్తా: ఎంపీడీవోను హెచ్చరించిన నల్లచెరువు మాజీ సర్పంచ్

Nallacheruvu ycp leader warns mpdo kr vijaya
  • తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి మండలంలో ఘటన
  • ఎంపీడీవో విజయను హెచ్చరించిన నల్లచెరువు మాజీ సర్పంచ్
  • రక్షణ కల్పించాలంటూ ఆర్డీవోను వేడుకున్న విజయ
తన మాట వినకుంటే చీరేస్తానంటూ మాజీ సర్పంచ్ ఒకరు ఎంపీడీవోను హెచ్చరించారు. తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి మండలంలో జరిగిందీ ఘటన. నియోజకవర్గంలోని వైసీపీ నేతల మధ్య గ్రూపు రాజకీయాలు నడుస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కారణంగా తమ వర్గానికి ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వడం లేదని భావించిన నల్లచెరువు మాజీ సర్పంచ్ వాసంశెట్టి తాతాజీ నిన్న ఎంపీడీవో కార్యాలయానికి చేరుకున్నారు.

వెళ్తూవెళ్తూనే అక్కడున్న ఎంపీడీవో కేఆర్ విజయపై విరుచుకుపడ్డారు. తమ మాట వినడం లేదని, మాట వినకుంటే చీరేస్తామని హెచ్చరించడంతో ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. ఆ సమయంలో అక్కడే ఉన్న కార్యాలయ సూపరింటెండెంట్ దీక్షితులు చెబుతున్నా వెనక్కి తగ్గలేదు సరికదా, అసభ్య పదజాలంతో దూషించారు. తాను ఇక్కడ పనిచేయడం ఇష్టం లేకుంటే ఎక్కడికైనా పంపించి వేయాలని ఎంపీడీవో చెబుతున్నా తాతాజీ వినిపించుకోలేదు. అనంతరం అమలాపురం ఆర్డీవో వసంతరాయుడికి ఫిర్యాదు చేసిన విజయ తనకు రక్షణ కల్పించాలని కోరారు.
East Godavari District
Ainavilli
MPDO
Nallacheruvu

More Telugu News