టీడీపీ నేతలపై కేసుల్లో తొందరపాటు చర్యలొద్దు: పోలీసులకు హైకోర్టు ఆదేశం

07-12-2021 Tue 08:05
  • భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అయ్యన్నపాత్రుడు సహా టీడీపీ నేతల ఆందోళన
  • పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ కేసులు
  • తొలుత నోటీసులు ఇచ్చి, వివరణ తీసుకోవాలని ఆదేశం
No hasty action in cases against TDP leaders High Court orders police
తెలుగుదేశం పార్టీ నేతలపై నమోదైన కేసుల్లో తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఏపీ హైకోర్టు ఆదేశించింది. తమపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, చింతకాయల విజయ్, వంగలపూడి అనిత తదితరులు హైకోర్టును ఆశ్రయించారు. విచారించిన జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్‌రాయ్ నేతృత్వంలోని ధర్మాసనం పోలీసులను పై విధంగా ఆదేశించింది.

సీఆర్‌పీసీ 41ఏ కింద తొలుత నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని ఆదేశించిన కోర్టు.. అరెస్ట్ విషయంలో తొందరపాటు చర్యలు వద్దని ఆదేశించింది. చంద్రబాబు భార్య భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా అయ్యన్నపాత్రుడు, ఇతర టీడీపీ నేతల ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో తమ విధులకు ఆటంకం కలిగించారని, పోలీసు వ్యవస్థకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేశారంటూ నర్సీపట్నం ఎస్సై లక్ష్మణరావు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో అయ్యన్నపాత్రుడు సహా టీడీపీ నేతలు కోర్టును ఆశ్రయించారు.