Chandrababu: 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న మీకు ఆ ఆలోచనే రాలేదా?: చంద్రబాబును ప్రశ్నించిన బొత్స

  • చంద్రబాబు మళ్లీ అబద్ధాలు మొదలుపెట్టారు
  • మూడు నెలల్లో 90 వేల ఇళ్లను అందుబాటులోకి తీసుకొస్తాం
  • ఓటీఎస్ అక్రమమని చెప్పడానికి చంద్రబాబు ఎవరు?
Botsa Satyanarayana Fires on Chandrababu Naidu

ఓటీఎస్‌కు డబ్బులు కట్టొద్దన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. చంద్రబాబు మళ్లీ అబద్ధాలు మొదలుపెట్టారంటూ దుయ్యబట్టారు. నిన్న వైసీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన బొత్స.. ఓటీఎస్‌కు డబ్బులు కట్టొద్దని చెబుతున్న చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉచితంగా ఇళ్లు ఎందుకు ఇవ్వలేకపోయారని ప్రశ్నించారు. ఇవ్వలేదు సరే.. కనీసం ఆ ఆలోచన కూడా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.

ఓటీఎస్ కింద లబ్ధిదారులకు గ్రామ, వార్డు సచివాలయంలో రిజిస్ట్రేషన్ చేసేందుకు ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుందన్నారు. దీనిని అక్రమమని చెప్పడానికి చంద్రబాబు ఎవరని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు మంచి చేస్తామంటే కోర్టుకు వెళ్లి అడ్డుకోవడం చంద్రబాబుకు అలవాటైన విద్యేనని దుమ్మెత్తి పోశారు. మూడు నెలల్లో 90 వేల ఇళ్లను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్టు మంత్రి తెలిపారు.

రాజ్యాంగాన్ని అమలు చేసేవారు సరైన వారు కాకపోతే వ్యవస్థ భ్రష్టుపట్టిపోతుందన్న చంద్రబాబు వ్యాఖ్యలకు ఆయనే నిలువెత్తు నిదర్శనమని అన్నారు. వైసీపీలో గెలిచిన ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకుని మంత్రి పదవులు కట్టబెట్టడం రాజ్యాంగ పరిరక్షణా? అని బొత్స ప్రశ్నించారు.

More Telugu News