Bandi Sanjay: తెలంగాణ రాష్ట్రాన్ని దళిత ద్రోహి ఏలుతున్నాడు: బండి సంజయ్

  • నేడు అంబేద్కర్ వర్ధంతి
  • ఢిల్లీలో నివాళులు అర్పించిన బండి సంజయ్
  • కేసీఆర్ ఏనాడూ నివాళులు అర్పించలేదని ఆరోపణ
  • పేదల పాలిట యముడిలా తయారయ్యాడని వ్యాఖ్యలు
Bandi Sanjay slams CM KCR on Ambedkar death anniversary

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో అంబేద్కర్ విగ్రహానికి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నివాళులు అర్పించారు. దీనిపై ఆయన ట్విట్టర్ లో స్పందించారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పై ఆయన విమర్శనాస్త్రాలు సంధించారు. కేసీఆర్ కు అంబేద్కర్ వర్ధంతి, జయంతి వేడుకలు గుర్తుండవని పేర్కొన్నారు. అంబేద్కర్ కు కేసీఆర్ ఏనాడూ నివాళులు అర్పించలేదని ఆరోపించారు. రాజుకు తగ్గట్టు అధికారులు కూడా అలాగే వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అంబేద్కర్ వర్ధంతి, జయంతి సందర్భంగా కేసీఆర్ ఎందుకు నివాళులు అర్పించడంలేదో చెప్పాలని నిలదీశారు.

"తెలంగాణ రాష్ట్రాన్ని దళిత ద్రోహి ఏలుతున్నాడు. పేదల పాలిట యముడిలా తయారయ్యాడు. దళిత బంధు ఇస్తా అన్నాడు, మూడెకరాల భూమి ఇస్తానన్నాడు. అన్నీ పచ్చి అబద్ధాలే! ఎన్నికల వేళ జై భీమ్, జై దళితులు అని, ఎన్నికల తర్వాత దళితులను పట్టించుకోని కేసీఆర్ క్షమాపణ చెప్పాలి" అని డిమాండ్ చేశారు.

బండి సంజయ్ అటు కాంగ్రెస్ పార్టీపైనా ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ ఏనాడూ అంబేద్కర్ ను పట్టించుకోలేదని, అంబేద్కర్ కు భారతరత్న ప్రకటించింది బీజేపీయేనని అన్నారు. రాబోయే తరాలకు స్ఫూర్తి కలిగించేలా అంబేద్కర్ పేరిట స్ఫూర్తి భవనాలు నిర్మించామని, అంబేద్కర్ జయంతి, వర్ధంతి సందర్భంగా బీజేపీ తరఫున అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

More Telugu News