మహారాష్ట్రలో పరువు హత్య... సోదరి తల, మొండెం వేరు చేసిన మైనర్ బాలుడు

06-12-2021 Mon 18:57
  • ఔరంగాబాద్ జిల్లాలో ఘటన
  • ప్రేమించి పెళ్లిచేసుకున్నందుకు అంతమొందించారు!
  • గర్భవతి అని కూడా చూడకుండా హత్య
  • మైనర్ బాలుడికి సహకరించిన తల్లి
  • మృతదేహం వద్ద సెల్ఫీలు
Honor killing in Maharashtra
దేశంలో పరువు హత్యలకు అడ్డుకట్ట పడడంలేదు. తాజాగా మహారాష్ట్రలో దారుణమైన రీతిలో ఓ పరువు హత్య జరిగింది. మైనర్ బాలుడు తన సోదరిని అత్యంత కిరాతకంగా అంతమొందించి, అనంతరం ఆమె తలను మొండెం నుంచి వేరు చేయడం గురించి వింటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఔరంగాబాద్ జిల్లాలో ఈ ఘాతుకం జరిగింది.

19 ఏళ్ల అమ్మాయి ఓ యువకుడ్ని ప్రేమించింది. అయితే అమ్మాయి తరఫు వారు ఒప్పుకోలేదు. దాంతో ఆ అమ్మాయి, యువకుడితో వెళ్లిపోయి పెళ్లి చేసుకుంది. వైజాపూర్ లోని అత్తింట్లో ఉంటోంది. కొన్నాళ్ల కిందట గర్భం దాల్చింది. అయితే, ఆ అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఆమె కుటుంబ సభ్యులను తీవ్ర అవమానానికి గురిచేసింది.

ఇటీవల ఆమె తల్లి వైజాపూర్ వెళ్లి కుమార్తెను ఇంటికి రావాలంటూ పిలిచింది. అయితే ఆ అమ్మాయి అందుకు అంగీకరించలేదు. దాంతో తల్లి మరోసారి వైజాపూర్ వచ్చింది. ఈసారి కుమారుడ్ని కూడా తీసుకుచ్చింది. అయితే, ఆ యువతి కిచెన్ లో ఉండగా... తల్లీకొడుకులు ఒక్కసారిగా ఆమెపై దాడి చేశారు. తల్లి కాళ్లు గట్టిగా పట్టుకోగా, కుమారుడు ఆ యువతిని కొడవలితో నరికాడు.

కిచెన్ లో శబ్దాలు రావడంతో మరో గదిలో విశ్రాంతి తీసుకుంటున్న ఆమె భర్త వచ్చాడు. దాంతో అతడిని కూడా చంపేందుకు ఆ తల్లీకొడుకులు ప్రయత్నించారు. కానీ ఆ యువకుడు వారి నుంచి తప్పించుకున్నాడు. ఆపై ఆ మైనర్ బాలుడు తన సోదరి తలను మొండెం నుంచి వేరు చేసి బయటికి తీసుకువచ్చి చుట్టుపక్కల వారికి చూపించాడు. అంతేగాదు, రక్తపుమడుగులో ఉన్న ఆమె మృతదేహం వద్ద ఆ తల్లీకొడుకులు సెల్ఫీలు కూడా దిగారు. అనంతరం ఆ బాలుడు సమీప పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు.