ప్రయాణికులతో కిటకిటలాడుతున్న ఢిల్లీ ఎయిర్ పోర్టు.. ఫొటోలు వైరల్... స్పందించిన కేంద్రమంత్రి

06-12-2021 Mon 18:01
  • దేశంలో ఒమిక్రాన్ కలకలం
  • ఎయిర్ పోర్టుల వద్ద కఠిన ఆంక్షలు
  • ఆర్టీపీసీఆర్ టెస్టులు తప్పనిసరి
  • కిటకిటలాడుతూ కనిపించిన ఢిల్లీ విమానాశ్రయం
Aviation minister Jyotiraditya Scindia reacts to Delhi Airport scenario
దేశంలో ఒమిక్రాన్ కలకలం నేపథ్యంలో కేంద్రం ఆంక్షలు కఠినతరం చేసింది. ముఖ్యంగా ఎయిర్ పోర్టుల వద్ద ప్రయాణికులకు కరోనా పరీక్షలు తప్పనిసరిగా అమలు చేస్తున్నారు. ఆర్టీపీసీఆర్ టెస్టులో నెగెటివ్ వస్తేనే అటు ప్రయాణాలకు, ఇటు ఎయిర్ పోర్టు నుంచి వెలుపలికి అనుమతిస్తున్నారు.

ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఢిల్లీ ఎయిర్ పోర్టుకు సంబంధించిన కొన్ని దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. పండుగ సీజన్ లో రద్దీగా ఉండే రైల్వే స్టేషన్ ను తలపించేలా ప్రయాణికులతో ఢిల్లీ ఎయిర్ పోర్టు కిటకిటలాడుతోంది. కరోనా టెస్టులు చేయించుకునేవారు, టెస్టులు చేయించుకుని ఫలితాల కోసం వేచిచూసేవారితో ఢిల్లీ ఎయిర్ పోర్టు తిరునాళ్ల మాదిరిగా మారింది.

దీనిపై ఫిర్యాదులు కూడా వస్తుండడంతో కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా స్పందించారు. ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులతోనూ, ఢిల్లీ ఎయిర్ పోర్టు నిర్వహణ బాధ్యతలు పర్యవేక్షిస్తున్న డీఐఏఎల్ సంస్థ ప్రతినిధులతోనూ సమావేశం నిర్వహించారు. ఢిల్లీ ఎయిర్ పోర్టులో పరిస్థితులపై చర్చించారు. ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు తగిన చర్యలు తీసుకోవాలంటూ డీఐఏఎల్ సంస్థకు స్పష్టం చేశారు. కరోనా వ్యాప్తికి అవకాశం ఇవ్వని రీతిలో చర్యలు ఉండాలని పేర్కొన్నారు.

కాగా, ఎయిర్ పోర్టులో కరోనా పరీక్షల సంగతి అటుంచితే, ఈ విధమైన జన సమూహాలతో కరోనా వ్యాప్తి ఇంకా అధికం అవుతుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.