Chandrababu: వైద్యానికి దాచుకున్న సొమ్మును కూడా ఓటీఎస్ కోసం లాగేస్తారా?: చంద్రబాబు ఆగ్రహం

  • ఇళ్ల మీదున్న రుణాలను రద్దు చేస్తామని గతంలో జగన్ హామీ ఇచ్చారు
  • జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారు
  • ఇష్టానుసారంగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు
Chandrababu fires on Jagan

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలు గుప్పించారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఇళ్లకు వన్ టైమ్ సెటిల్మెంట్ (ఓటీఎస్) పేరుతో బలవంతపు వసూళ్లు చేస్తూ, స్వచ్ఛందమంటారా? అని విమర్శించారు. మాట తప్పడం, మడమ తిప్పడం జగన్ కు అలవాటైందని అన్నారు. ఇళ్లమీదున్న రుణాలను రద్దు చేస్తానని ఎన్నికల ప్రచారం సమయంలో జగన్ హామీ ఇచ్చారని... ఇప్పుడు మాట తప్పారని విమర్శించారు. వైద్యానికి దాచుకున్న సొమ్మును కూడా ఓటీఎస్ కోసం లాగేస్తారా? అని ప్రశ్నించారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం గురించి అన్ని పేపర్లలో ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చారని విమర్శించారు.

పులిచింతల ప్రాజెక్టు కోసం భూములిచ్చి పునరావాసంలో భాగంగా ఇళ్లు తీసుకున్న పేదల నుంచి కూడా ఓటీఎస్ వసూలు చేస్తారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. ఇష్టానుసారంగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని, డాక్యుమెంట్లను వైకాపా రంగుల్లో ఇస్తున్నారని మండిపడ్డారు. అమరావతిలో తాము నిర్మించాలనుకున్న అంబేద్కర్ విగ్రహ నిర్మాణాన్ని వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి తమ ప్రభుత్వ హయాంలో 20 ఎకరాల భూమిని కూడా ఎంపిక చేశామని... దేశానికే ఆదర్శమైన తమ నిర్ణయాన్ని వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు.

More Telugu News