'ఆర్ ఆర్ ఆర్' నుంచి కొత్త పోస్టర్ .. దెబ్బతిన్న సింహంలా ఎన్టీఆర్!

06-12-2021 Mon 12:02
  • 'ఆర్ ఆర్ ఆర్'పై భారీ అంచనాలు
  • సాయంత్రంలోగా చరణ్ స్పెషల్ పోస్టర్  
  • ఈ నెల 9వ తేదీన ట్రైలర్ రిలీజ్
  • జనవరి 7వ తేదీన సినిమా విడుదల
RRR movie update
రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన 'ఆర్ ఆర్ ఆర్' నుంచి ఒక్కో అప్ డేట్ ను వదులుతూ వెళుతున్నారు. వచ్చిన ప్రతి అప్ డేట్ .. సినిమాపై అంతకంతకూ అంచనాలు పెంచుతూ వెళుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి కొమరం భీమ్ గా ఎన్టీఆర్ పోస్టర్ ను వదిలారు. ఆంగ్లేయులచే శిక్షించబడినట్టుగా ఆయన శరీరం రక్తసిక్తమై కనిపిస్తోంది.

దేహంపై రక్తం ధారలు కట్టినా .. ఆయన కళ్లలో తెగింపే తప్ప భయం కనిపించడం లేదు. దెబ్బ తిన్న సింహంలా ఈ పోస్టర్లో ఆయన కనిపిస్తున్నాడు. ఉప్పొంగుతున్న ఆవేశానికి .. ఉరకలేస్తున్న ఆశయానికి ఆహారంగా బానిసత్వాన్ని సమర్పించాలనే బలమైన నిర్ణయానికి వచ్చినట్టుగా అనిపిస్తున్నాడు.

ఇక ఈ రోజు సాయంత్రంలోగా చరణ్ .. అల్లూరి సీతారామరాజు లుక్ కూడా రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వదిలిన లిరికల్ వీడియో సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నెల 9వ తేదీన ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. జనవరి 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా సినిమాను వివిధ భాషల్లో విడుదల చేయనున్నారు.