శేఖర్ కమ్ముల ఇంటిచుట్టూ తిరిగాను: నాగశౌర్య

06-12-2021 Mon 11:29
  • 'హ్యాపీడేస్' తెగ నచ్చేసింది
  • శేఖర్ కమ్ముల కళ్లలో పడాలనుకున్నాను
  • ఆయనతో ఒక సినిమా చేయాలనుంది
  • ఆయన ఎప్పుడంటే అప్పుడేనన్న నాగశౌర్య
Lakshya movie upadate
నాగశౌర్య సినిమా 'లక్ష్య' ఈ నెల 10వ తేదీన థియేటర్స్ కి రానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న రాత్రి జరిగింది. ముఖ్య అతిథులలో ఒకరిగా శేఖర్ కమ్ముల హాజరయ్యాడు. స్టేజ్ పై నాగశౌర్య మాట్లాడుతూ .. "నేను శేఖర్ కమ్ములగారి అభిమానిని. 'హ్యాపీడేస్' రిలీజ్ తరువాత నేను ఆయన ఇంటి అడ్రెస్ తెలుసుకోవడానికి తెగ తిరిగేశాను.

పద్మారావునగర్ లో ఆయన ఉంటారని తెలుసుకుని .. అడ్రెస్ పట్టుకుని వెళ్లాను. ఆయన నన్ను చూడటం ఆలస్యం సినిమాల్లోకి తీసుకుంటారనే ఒక ధీమాతో ఉండేవాడిని. ఆయన కంట్లో పడాలని ఆయన ఇంటిముందు బైక్ పై అటూ ఇటూ తిరిగేవాడిని. డాబాపై ఆయన స్క్రిప్ట్ రాసుకుంటూ ఉండేవారు.

ఎన్నిసార్లు ఆయన ఇంటి ముందు తిరిగినా .. ఎన్నిసార్లు హారన్లు కొట్టినా ఆయన ఎప్పుడూ నా వైపు చూడలేదు. ఆయన తన పనిని ఎంత అంకితభావంతో చేస్తారనేది నాకు అర్థమైంది. ఆయన దర్శకత్వంలో ఒక సినిమా చేయాలనుంది. ఆయన ఎప్పుడంటే అప్పుడే చేయడానికి నేను రెడీగా ఉన్నాను" అంటూ చెప్పుకొచ్చాడు. త్వరలో నాగశౌర్య కోరిక నెరవేరుతుందేమో చూడాలి మరి.