BJP: 'మాన్ సాబ్.. బీజేపీలో చేరేందుకు ఎంత తీసుకుంటారు?' అంటూ అడిగారు: కాషాయ పార్టీపై ఆప్ ఎంపీ సంచలన ఆరోపణలు

  • భారీగా నగదు, కేంద్ర మంత్రి పదవి ఇస్తామన్నారు
  • నేను కమిషన్ల కోసం రాజకీయాల్లోకి రాలేదు
  • నన్ను డబ్బుతో కొనలేరు
  • ఆప్ పంజాబ్ చీఫ్ భగవంత్ మాన్
Was offered money and cabinet berth Bhagwant Mann alleged bjp

పంజాబ్‌లో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న వేళ ఆ రాష్ట్ర రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. అక్కడ జెండా పాతాలని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించింది. ఆ పార్టీ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇప్పటికే పంజాబ్ ప్రజలపై హామీల వర్షం కురిపిస్తున్నారు. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌తో కలిసి పంజాబ్‌ను హస్తగతం చేసుకోవాలని బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది.

ఈ నేపథ్యంలో తాజాగా ‘ఆప్’ పంజాబ్ చీఫ్, ఎంపీ భగవంత్ మాన్ బీజేపీపై చేసిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. నాలుగు రోజుల క్రితం బీజేపీ సీనియర్ నేత నుంచి తనకు ఫోన్ కాల్ వచ్చిందని చెప్పిన ఆయన.. ఆప్‌ను వదిలేసి బీజేపీలో చేరితే భారీగా నగదుతోపాటు కేంద్రమంత్రి పదవి కూడా ఇస్తామని చెబుతూ ప్రలోభ పెట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు.

‘‘మాన్ సాబ్, బీజేపీలో చేరడానికి ఎంత తీసుకుంటారు? మీకు డబ్బు కావాలా?’’ అని ఆయన నేరుగా అడిగేశారని భగవంత్ మాన్ విలేకరులకు తెలిపారు. ఆ నేత ఆఫర్‌ను తాను తిరస్కరించినట్టు చెప్పారు. తానో మిషన్‌పై రాజకీయాల్లోకి వచ్చానని, తనను డబ్బుతో కొనలేరని తేల్చి చెప్పారు. తాను కమిషన్ల కోసం రాజకీయాల్లోకి రాలేదని ఎంపీ స్పష్టం చేశారు.

More Telugu News