ప్రయాణికుడు చనిపోవడంతో ఢిల్లీ తిరిగొచ్చిన అమెరికా వెళ్లే విమానం

04-12-2021 Sat 16:24
  • ఢిల్లీ నుంచి నెవార్క్ కు వెళుతున్న ఎయిరిండియా విమానం
  • గాల్లో ఉండగానే ప్రయాణికుడికి అస్వస్థత
  • టేకాఫ్ తీసుకున్న 3 గంటల తర్వాత ఢిల్లీకి తిరిగిరాక
  • ప్రయాణికుడిని పరీక్షించిన వైద్యులు
  • అప్పటికే మరణించినట్టు నిర్ధారణ
US bound Air India plane returned to Delhi after passenger died
ఎయిరిండియా విమానంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీ నుంచి అమెరికాలోని నెవార్క్ వెళుతున్న విమానంలో ఓ ప్రయాణికుడు మార్గమధ్యంలో మరణించాడు. అతడిని అమెరికా జాతీయుడిగా గుర్తించారు. అతడు తన భార్యతో కలిసి ప్రయాణిస్తున్నాడు. అయితే విమానం గాల్లో ఉండగా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు.

దాంతో, టేకాఫ్ తీసుకున్న మూడు గంటల తర్వాత ఆ విమానం తిరిగి ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంది. విమానంలోకి ప్రవేశించిన ఎయిర్ పోర్టు వైద్య సిబ్బంది ఆ ప్రయాణికుడిని పరీక్షించి, అప్పటికే చనిపోయినట్టు నిర్ధారించారు. విమాన సిబ్బంది ఈ విషయాన్ని ఎయిర్ పోర్టు పోలీసులకు నివేదించారు. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకున్న పోలీసులు తదుపరి కార్యాచరణకు ఉపక్రమించారు.