అత్యున్నత విలువలకు మారుపేరు రోశయ్య: సీజేఐ ఎన్వీ రమణ

04-12-2021 Sat 16:06
  • రోశయ్య భౌతికకాయానికి నివాళి అర్పించిన ఎన్వీ రమణ
  • ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించారన్న సీజేఐ
  • రోశయ్య మరణం తెలుగువారందరికీ తీరని లోటని వ్యాఖ్య
CJI NV Ramana pays tributes to Rosaiah
ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మృతి పట్ల సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. హైదరాబాద్ పర్యటనలో ఉన్న ఆయన రోశయ్య నివాసానికి వెళ్లి ఆయన పార్థివ దేహానికి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ... పరిపాలనా దక్షుడిగా రోశయ్య పేరుగాంచారని అన్నారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించారని కొనియాడారు. రాజకీయాలకు అతీతంగా ప్రజలంతా కలసికట్టుగా ఉండాలని, తెలుగు ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించేవారని చెప్పారు.

అత్యున్నత విలువలకు మారుపేరుగా నిలిచిన వ్యక్తుల్లో రోశయ్య ఒకరని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. తెలుగు భాషకు, సంస్కృతికి, కళలకు ఆయన పెద్దపీట వేశారని చెప్పారు. రోశయ్య మరణం తెలుగువారందరికీ తీరని లోటని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.