Team India: హడలెత్తించిన టీమిండియా బౌలర్లు... 62 పరుగులకే కుప్పకూలిన కివీస్

  • ముంబయిలో టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్
  • తొలి ఇన్నింగ్స్ లో భారత్ 325 ఆలౌట్
  • ఆపై విజృంభించిన అశ్విన్, సిరాజ్, అక్షర్
  • కాసేపట్లోనే ముగిసిన కివీస్ తొలి ఇన్నింగ్స్
  • భారత్ 263 పరుగుల ఆధిక్యం
Kiwis bundled out for a low score

ముంబయి టెస్టులో టీమిండియా బౌలర్లు సమష్టిగా కదంతొక్కారు. న్యూజిలాండ్ జట్టును తొలి ఇన్నింగ్స్ లో 62 పరుగులకే కుప్పకూల్చారు. తద్వారా టీమిండియాకు కీలకమైన 263 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. రవిచంద్రన్ అశ్విన్ 4, మహ్మద్ సిరాజ్ 3, అక్షర్ పటేల్ 2, జయంత్ యాదవ్ 1 వికెట్ తో సత్తా చాటారు. కివీస్ జట్టులో 17 పరుగులు చేసిన కైల్ జేమీసన్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. తాత్కాలిక కెప్టెన్ టామ్ లాథమ్ 10 పరుగులు చేయగా, మిగతా వాళ్లందరూ సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితం అయ్యారు.

అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్ లో 325 పరుగులు చేయగా, ఆపై ఇన్నింగ్స్ ప్రారంభించిన కివీస్ కు ఏదీ కలిసిరాలేదు. ఓపెనర్లు విల్ యంగ్ (4), టామ్ లాథమ్ (10) లను అవుట్ చేసిన పేసర్ సిరాజ్ భారత్ శిబిరంలో ఉత్సాహం నింపాడు. అక్కడ్నించి న్యూజిలాండ్ పతనం ప్రారంభమైంది. టీమిండియా బౌలర్లు ఒకరిని మించి మరొకరు ఉత్సాహంతో బౌలింగ్ చేస్తూ వికెట్ల వేట కొనసాగించారు.

అశ్విన్ 8 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 8 పరుగులిచ్చి 4 వికెట్లు తీయడం విశేషం. అశ్విన్ స్పెల్ లో రెండు మెయిడెన్లు కూడా ఉన్నాయి. తొలిటెస్టులో భారత కు కొరకరానికొయ్యలా పరిణమించిన రచిన్ రవీంద్ర (4)ను సీనియర్ ఆఫ్ స్పిన్నర్ జయంత్ యాదవ్ బుట్టలో వేశాడు. కివీస్ తొలి ఇన్నింగ్స్ ఏ దశలోనూ ఆశాజనకంగా కనిపించలేదు. క్రీజులో కుదురుకోవడానికే ఆపసోపాలు పడ్డారు.

కాగా, న్యూజిలాండ్ జట్టు ఫాలో ఆన్ లో పడినప్పటికీ, టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ఇవాళ సాయంత్రం వరకు ఆడి 350 పైచిలుకు లక్ష్యాన్ని నిర్దేశించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

More Telugu News