ప్రభుత్వ తప్పిదంతోనే 62 మంది చనిపోయారు... కేంద్రం కూడా అదే చెబుతోంది: చంద్రబాబు

04-12-2021 Sat 14:10
  • కడప జిల్లాలో జలవిలయం
  • వరదల కారణంగా భారీ ప్రాణనష్టం
  • ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టమైందన్న చంద్రబాబు
  • న్యాయవిచారణకు ఎందుకు అంగీకరించరని ఆగ్రహం
Chandrababu fires on AP Govt over huge floods
కడప జిల్లాలో వరద బీభత్సం పెద్ద సంఖ్యలో ప్రాణాలను బలిగొన్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రాష్ట్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే 62 మంది చనిపోయారని, రూ.6 వేల కోట్ల మేర ఆస్తి, పంట నష్టం జరిగిందని వివరించారు. ఈ మేరకు కేంద్రమంత్రి కూడా ప్రకటన చేశారని అన్నారు. కేంద్రమంత్రి ప్రకటనకు ఏం సమాధానం చెబుతారని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలను నిలదీశారు.

అన్నమయ్య ప్రాజెక్టు గేట్లకు మరమ్మతులు చేయించకపోవడంతో గేట్లు మొత్తం కొట్టుకుపోయాయని చంద్రబాబు ఆరోపించారు. తెలిసో తెలియకో మీకు ఓట్లేశారు... ఇప్పుడు వాళ్ల ప్రాణాలు హరించారు అంటూ మండిపడ్డారు. వరదల సమయంలో వైసీపీ సర్కారు నిర్లక్ష్యం స్పష్టంగా తెలుస్తోందని, న్యాయవిచారణ కోరితే ఎందుకు అంగీకరించడంలేదని ప్రశ్నించారు.