రోశయ్య భౌతికకాయానికి నివాళి అర్పించిన సీఎం కేసీఆర్

04-12-2021 Sat 13:02
  • రోశయ్య నివాసానికి వెళ్లిన కేసీఆర్
  • కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన సీఎం
  • రేపు అంత్యక్రియలు నిర్వహిస్తామని సీఎంకు తెలిపిన కుటుంబసభ్యులు
KCR pays tributes to Rosaiah
మాజీ ముఖ్యమంత్రి రోశయ్య పార్థివ దేహానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళి అర్పించారు. రోశయ్య నివాసానికి వెళ్లిన కేసీఆర్ కుటుంబసభ్యులతో మాట్లాడి ఓదార్చారు. వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. హైదరాబాద్ కొంపల్లిలో ఉన్న ఫామ్ హౌస్ లో రేపు అంత్యక్రియలను నిర్వహిస్తామని ఈ సందర్భంగా కేసీఆర్ కు రోశయ్య కుటుంబసభ్యులు తెలిపారు. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో రోశయ్య అంత్యక్రియలు జరగనున్నాయి.

అంతకు ముందు రోశయ్య మరణ వార్త తెలియగానే కేసీఆర్ స్పందించారు. సౌమ్యుడిగా, సహనశీలిగా రాజకీయాల్లో రోశయ్య తనదైన ముద్ర వేశారని ఆయన కొనియాడారు. మంత్రిగా, ఉమ్మడి ఏపీ సీఎంగా, గవర్నర్ గా తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో పలు పదవులను అలంకరించారని... ఆయన మృతి రెండు తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు అని అన్నారు. రోశయ్య మరణ వార్త తనను ఎంతో బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు.