WHO: ఇప్పటివరకు ఒమిక్రాన్ వేరియంట్ తో ఎవరూ చనిపోలేదు: డబ్ల్యూహెచ్ఓ

  • ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ అలజడి
  • పలుదేశాల్లో కొత్త వేరియంట్ కేసులు
  • మళ్లీ ఆంక్షలు విధిస్తున్న దేశాలు
  • స్పందించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ
WHO says no deaths caused by Omicron variant till date

ఓవైపు ప్రపంచ దేశాల్లో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ గుబులు రేపుతున్న తరుణంలో, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఊరట కలిగించే విషయం చెప్పింది. ఒమిక్రాన్ వేరియంట్ తో ఇప్పటివరకూ ఎవరూ చనిపోలేదని వెల్లడించింది. ఈ కొత్త వేరియంట్ కు సంబంధించి ప్రపంచ దేశాల నుంచి విస్తృతస్థాయిలో సమాచారం సేకరిస్తున్నామని తెలిపింది.

జెనీవాలో డబ్ల్యూహెచ్ఓ అధికార ప్రతినిధి క్రిస్టియన్ లిండ్మీయర్ మాట్లాడుతూ, ఒమిక్రాన్ తో ఎక్కడా ఎలాంటి మరణాలు నమోదు కాలేదని వివరించారు. ప్రపంచ దేశాలు ఒమిక్రాన్ నేపథ్యంలో అత్యధిక టెస్టులు నిర్వహిస్తున్నందువల్ల మరిన్ని కేసులు గుర్తించగలమని, మరింత సమాచారాన్ని తెలుసుకోగలమని తెలిపారు. ప్రస్తుతం ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నప్పటికీ, ఇప్పటిదాకా అత్యంత తీవ్ర ప్రభావం చూపిన వేరియంట్ గా డెల్టా వేరియంట్ గురించే చెబుతామని లిండ్మీయర్ పేర్కొన్నారు.

ఒమిక్రాన్ తీవ్రత ఏపాటిదన్న అంశంపై ప్రకటన చేసేందుకు మరికొన్ని వారాల సమయం పడుతుందని, ఒమిక్రాన్ సంక్రమణ వేగం, వ్యాధి లక్షణాల తీవ్రత, దీనిపై వ్యాక్సిన్ల పనితీరు, చికిత్సకు స్పందించే తీరును ఇప్పట్లో చెప్పలేమని డబ్ల్యూహెచ్ఓ ప్రతినిధి స్పష్టం చేశారు.

More Telugu News