Team India: ముంబయి టెస్టులో ముగిసిన తొలి రోజు ఆట... టీమిండియా స్కోరు 221/4

  • ముంబయిలో భారత్ వర్సెస్ కివీస్
  • ప్రారంభమైన రెండో టెస్టు
  • టాస్ గెలిచిన భారత్
  • తొలి ఇన్నింగ్స్ లో కుదుపులు
  • అజాజ్ పటేల్ కు 4 వికెట్లు
Day one concludes in Mumbai test between Team India and New Zealand

వాతావరణం అనుకూలించక ఆలస్యంగా మొదలైన ముంబయి టెస్టులో తొలి రోజు ఆట ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా ఆట ముగిసేసరికి తొలి ఇన్నింగ్స్ లో 4 వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేసింది. సెంచరీ హీరో మయాంక్ అగర్వాల్ 120 పరుగులతోనూ, వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా 25 పరుగులతో క్రీజులో ఉన్నారు.

టీమిండియా కోల్పోయిన 4 వికెట్లు కివీస్ లెఫ్టార్మ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ ఖాతాలోకి చేరాయి. కొన్ని బంతుల వ్యవధిలోనే ఓపెనర్ శుభ్ మాన్ గిల్ (44), ఛటేశ్వర్ పుజారా (0), కెప్టెన్ విరాట్ కోహ్లీ (0) వికెట్లను చేజిక్కించుకున్న అజాజ్ పటేల్... ఆ తర్వాత ఫామ్ లో ఉన్న శ్రేయాస్ అయ్యర్ వికెట్ కూడా సాధించాడు. తొలి టెస్టులో సెంచరీ సాధించిన అయ్యర్ ఈసారి 18 పరుగులు చేశాడు.

ఓ దశలో 80 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన భారత్ ను మయాంక్-అయ్యర్ జోడీ 160 పరుగుల వరకు చేర్చింది. అయ్యర్ అవుటైన తర్వాత మయాంక్ కు సాహా జత కలిశాడు. వీరిద్దరూ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ స్కోరును 200 మార్కు దాటించారు.

ఇక తొలిరోజు ఆటలో కెప్టెన్ విరాట్ కోహ్లీని థర్డ్ అంపైర్ అవుట్ గా ప్రకటించడం విమర్శలకు దారితీసింది. స్పిన్నర్ అజాజ్ పటేల్ విసిరిన బంతిని డిఫెన్స్ ఆడేందుకు కోహ్లీ ప్రయత్నించగా, బంతి బ్యాట్ ను తాకుతూ ప్యాడ్ కు తగిలింది. అయితే టీవీ అంపైర్ ఇదేమీ పట్టించుకోకుండా ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని సమర్థిస్తూ అవుట్ గా నిర్ధారించాడు. టీవీ రీప్లేల్లో బంతి బ్యాట్ కు తగిలినట్టు పదేపదే చూపిస్తుండగా, డ్రెస్సింగ్ రూంలో కోహ్లీ తీవ్రంగా స్పందించడం లైవ్ లో కనిపించింది.

More Telugu News