IMD: 'జవాద్' తుపానుపై ఐఎండీ కీలక అప్ డేట్ ఇదిగో!

  • ఆగ్నేయ బంగాళాఖాతంలో జవాద్ 
  • తుపానుగా మారిన తీవ్ర వాయుగుండం
  • రేపు ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు చేరువగా రాక
  • ఆపై మలుపు తీసుకుని బెంగాల్ దిశగా పయనం
IMD latest weather bulletin about Cyclone Jawad

ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం బలపడి తుపానుగా మారడం తెలిసిందే. అయితే ఈ తుపాను రేపు ఉదయం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా మధ్య తీరం దాటుతుందని తొలుత భావించారు. అయితే, భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తాజాగా ఆసక్తికర అంశాన్ని వెల్లడించింది. ఇది ఉత్తరాంధ్ర వద్ద తీరం దాటే అవకాశాల్లేవని తెలిపింది.

ప్రస్తుతం విశాఖపట్నంకు ఆగ్నేయ దిశగా 360 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న జవాద్ తుపాను ఉత్తర వాయవ్య దిశగా పయనించి ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు చేరువగా వస్తుందని వివరించింది. అక్కడ్నించి మలుపు తీసుకుని ఒడిశా తీరాన్ని తాకుతూ డిసెంబరు 5 నాటికి పూరీ చేరుకుంటుందని ఐఎండీ పేర్కొంది. ఆపై అలాగే తీరం వెంబడి కొనసాగుతూ పశ్చిమ బెంగాల్ దిశగా పయనిస్తుందని వెల్లడించింది.

కాగా ఇది తీరానికి చేరువగా వచ్చే సమయానికి తీవ్ర తుపానుగా బలపడుతుందని, దీని ప్రభావంతో డిసెంబరు 4న ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, కొన్నిచోట్ల అతి భారీ వర్షాల నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తన తాజా నివేదికలో తెలిపింది. అదే సమయంలో తీరం వెంబడి గంటకు 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించింది.

డిసెంబరు 5న ఒడిశా తీరంలో ఒక మీటరు ఎత్తున ఉప్పెన వచ్చే అవకాశం ఉందని వివరించింది. ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల్లో 2 నుంచి 4 మీటర్ల ఎత్తున అలలు విరుచుకుపడతాయని పేర్కొంది.

More Telugu News