నేను కావాలో, మటన్ కావాలో తేల్చుకోమన్న భర్త... నెట్టింట సందడి చేస్తున్న భార్యాభర్తల గోల!

03-12-2021 Fri 17:39
  • సోషల్ మీడియాలో ఓ లేఖ వైరల్
  • తన భార్యకు మాంసం అలవాటుందన్న భర్త
  • పెళ్లి తర్వాత మానేస్తానని మాటిచ్చిందని వెల్లడి
  • కానీ తింటోందని ఆరోపణ
Husband gives ultimatum to wife on Mutton eating habit
భార్యాభర్తలన్నాక గొడవలు సహజం! కానీ ఈ జంట విషయంలో మటన్ చిచ్చుపెట్టింది. ఈ వ్యవహారంలోకి వెళితే.... శాకాహారి అయిన వ్యక్తి తన భార్య కూడా అలాగే ఉండాలని కోరుకున్నాడు. మాంసాహారం ముట్టని కులం నుంచి ఓ అమ్మాయిని పెళ్లాడాడు. కానీ పెళ్లయిన తర్వాత ఆమె తన నిజస్వరూపం ప్రదర్శించింది. ఇష్టంవచ్చినట్టు మాంసాహారం లాగిస్తూ భర్తను దిగ్భ్రాంతికి గురిచేసింది. దాంతో ఆ సాధుజీవి హతాశుడయ్యాడు. తన బాధను ఓ కాలమిస్టుతో వెళ్లబోసుకున్నాడు.

ఆ భర్త సదరు వ్యాసకర్తకు రాసిన లేఖ నెట్టింట సందడి చేస్తోంది. ఇంతకీ ఆ లేఖలో ఏముందంటే... "నేను స్వచ్ఛమైన శాకాహారిని. కులం రీత్యా పూర్తి శాకాహారి అని భావించి ఓ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. కానీ ఆమె తనకు మటన్ తినే అలవాటు ఉందని చెప్పింది. ఆమె అందంగా ఉండడంతో వదులుకోలేక పెళ్లి చేసుకున్నాను. పెళ్లయిన తర్వాత మాంసాహారం జోలికి వెళ్లనని ఆమెతో మాట తీసుకున్నాను. కానీ పెళ్లయిన తర్వాత ఆమె యథాప్రకారం మటన్ తింటోంది.

నా కంటపడకుండా రహస్యంగా బయటికి వెళ్లి మాంసాహారం తీసుకుంటోంది. అదేమని నిలదీస్తే... నేను మటన్ తినకుండా ఉండలేనని తెగేసి చెబుతోంది. దాంతో... నేను కావాలో మటన్ కావాలో తేల్చుకోమని ఆమెకు స్పష్టం చేశాను. కానీ ఇప్పుడు నన్నో భయం పట్టిపీడిస్తోంది. ఒకవేళ ఆమె నిజంగానే మటన్ ను ఎంచుకుంటే నా పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఆమె ఏం ఎంచుకుంటుందని మీరు భావిస్తున్నారు?" అంటూ ఆ భర్త సదరు కాలమిస్టును ప్రశ్నించాడు.

అందుకు ఆ వ్యాసకర్త కూడా అదే రీతిలో నాటకీయంగా బదులిచ్చాడు. "నాకు తెలిసి ఓ భార్య, ఓ భర్త, మటన్ మధ్య ఇదే తొలి ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనుకుంటా. నేను ఏమనుకుంటున్నానంటే... ఎవరైనా ప్రేమ లేకుండా ఉండగలరేమో కానీ తిండి లేకుండా ఉండలేరు కదా! దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి... మీ భార్య ఎవరిని ఎంచుకుంటుందో!" అంటూ తెలివిగా తప్పించుకున్నాడు. ఇక ఈ అంశం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు తమకు తోచిన సలహాలు ఇస్తున్నారు.