Mayank Agarwal: ముంబయి టెస్టులో మయాంక్ అగర్వాల్ సూపర్ సెంచరీ

Mayank Agarwal completes his fourth ton in tests
  • ముంబయిలో భారత్ వర్సెస్ కివీస్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
  • 80 పరుగులకే 3 వికెట్లు రాలిన వైనం
  • అపై అయ్యర్ కూడా అవుట్
  • సాహాతో కలిసి మయాంక్ అగర్వాల్ పోరాటం
  • అజాజ్ పటేల్ కు 4 వికెట్లు
న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్ అద్భుత ఆటతీరుతో సెంచరీ సాధించాడు. భారత్ జట్టు ఓవైపు వికెట్లు కోల్పోతున్నప్పటికీ ఏకాగ్రతతో ఆడిన మయాంక్ 196 బంతుల్లో 100 పరుగులు నమోదు చేశాడు. టెస్టుల్లో మయాంక్ అగర్వాల్ కు ఇది నాలుగో సెంచరీ.

కివీస్ స్పిన్నర్ అజాజ్ పటేల్ పిచ్ ను సద్వినియోగం చేసుకుని టర్న్ తో విజృంభిస్తున్నప్పటికీ ఈ కర్ణాటక యువకిశోరం నిబ్బరంగా ఆడి టీమిండియా ఇన్నింగ్స్ ను నిలబెట్టాడు. మరో ఓపెనర్ శుభ్ మాన్ గిల్ తో కలిసి తొలి వికెట్ కు 80 పరుగులు జోడించి గట్టి పునాది వేశాడు. కానీ, అనూహ్య రీతిలో భారత్ 80 పరుగుల వద్ద వరుసగా గిల్, పుజారా, కెప్టెన్ కోహ్లీల వికెట్లు కోల్పోయింది. ఈ మూడు వికెట్లు అజాజ్ పటేల్ కే దక్కాయి.

ఆపై శ్రేయాస్ అయ్యర్ (18)తో కలిసి ఇన్నింగ్స్ ను పునర్ నిర్మించిన మయాంక్... స్కోరుబోర్డును ముందుకు తీసుకెళ్లాడు. ఇక అయ్యర్ కూడా అజాజ్ పటేల్ కే వికెట్ అప్పగించి పెవిలియన్ చేరగా, వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ వృద్ధిమాన్ సాహాతో కలిసి మయాంక్ పోరాటం సాగించాడు.

ప్రస్తుతం టీమిండియా స్కోరు 65 ఓవర్లలో 4 వికెట్లకు 207 పరుగులు. మయాంక్ 107, సాహా 24 పరుగులతో ఆడుతున్నారు. కివీస్ స్పిన్నర్ అజాజ్ పటేల్ 4 వికెట్లు తీశాడు.
Mayank Agarwal
Century
Ton
Team India
New Zealand
Mumbai

More Telugu News