బంగాళాఖాతంలో 'జవాద్'... తుపానుగా మారిన వాయుగుండం

03-12-2021 Fri 14:14
  • జవాద్ గా నామకరణం
  • ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా దిశగా పయనం
  • విశాఖకు ఆగ్నేయంగా 420 కిమీ దూరంలో తుపాను
  • ఏపీ, ఒడిశా, బెంగాల్, అసోం, మేఘాలయలో భారీ వర్షాలు
Depression turns into Cyclon Jawad in Bay of Bengal
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడి ఈ మధ్యాహ్నం తుపానుగా మారింది. ఈ తుపానుకు జవాద్ అని నామకరణం చేశారు. ప్రస్తుతం ఈ తుపాను విశాఖపట్నంకు ఆగ్నేయంగా 420 కిలోమీటర్లు, ఒడిశాలోని పరదీప్ కు ఆగ్నేయంగా 650 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. తుపాను కారణంగా ప్రస్తుతం గరిష్టంగా గంటకు 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.

ఈ తుపాను వివరాలపై భారత వాతావరణ విభాగం (ఐఎండీ) డైరెక్టర్ జనరల్ ఎం.మహాపాత్ర మీడియా సమావేశం నిర్వహించారు. జవాద్ ప్రభావం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాలపై అధికంగా ఉంటుందని మహాపాత్ర వెల్లడించారు. ఈ నెల 3 నుంచి 6వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, అసోం, మేఘాలయ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. డిసెంబరు 4వ తేదీ సాయంత్రానికి ఈ తుపాను ప్రభావంతో గరిష్టంగా 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొన్నారు.