Chandrababu: డిసెంబరు వచ్చేసింది.. పోలవరం ప్రారంభోత్సవానికి వెళ్దామా?: చంద్రబాబు

  • గురజాల నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తలతో చంద్రబాబు సమావేశం
  • డిసెంబరు 2021 నాటికి పూర్తిచేస్తామని ప్రగల్భాలు పలికారుగా..
  • 75 ఏళ్ల వ్యక్తిపై హత్యానేరం మోపడం కంటే నీచముంటుందా?
  • వైసీపీ అరాచకాలను ఎదిరించిన హైమావతికి అభినందనలు
Chandrababu fires on AP CM YS Jagan once again

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అభివృద్ధిలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఇప్పుడు అప్పుల కుప్పలు, దోపిడీలు, నిత్యావసర ధరల పెరుగుదల వంటి విషయాల్లో అగ్రస్థానంలో ఉందని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. గురజాల నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తలతో పార్టీ కేంద్ర కార్యాలయంలో నిన్న సమావేశమైన చంద్రబాబు ఇటీవల జరిగిన దాచేపల్లి, గురజాల ఎన్నికల ఫలితాలను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

పంచాయతీలకు ఆర్థిక సంఘాలు ఇచ్చిన నిధులను కూడా లాగేసుకోవడం దుర్మార్గమని అన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం తప్పుబట్టడం సీఎం జగన్‌కు చెంపపెట్టు అని అన్నారు. ఎవరూ ఓటీఎస్ డబ్బులు కట్టొద్దని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అదే నెలలో ఉచితంగా పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు. పాదయాత్ర చేస్తున్న రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిసెంబరు 2021 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తిచేస్తామని ముఖ్యమంత్రి, మంత్రి పగల్భాలు పలికారని, పూర్తిచేశారా? పోలవరం ప్రారంభోత్సవానికి వెళదామా? అని ప్రశ్నించారు.

వైసీపీ నేతలు అక్రమంగా తవ్వివదిలేసిన క్వారీల గుంతల్లో పడి ఏడుగురు చిన్నారులు మరణించారని, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గురజాల నియోజకవర్గంలో 8 మంది టీడీపీ కార్యకర్తల్ని హతమార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్‌కు అసలు మానవత్వం ఉందా? మనిషైతే హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తారా? అని దుయ్యబట్టారు. తురకపాలెంలో 75 ఏళ్ల షేక్‌మూల్‌సాబ్, 68 ఏళ్ల షేక్ చాంద్‌బీ దంపతులపైనా హత్యయత్నం కేసు పెట్టారంటే ఇంతకంటే నీచం ఇంకేముంటుందని ప్రశ్నించారు.

వైసీపీ అరాచకాలను ఎదిరించి మరీ హైమావతి శావల్యాపురం జెడ్పీటీసీగా విజయం సాధించారని పేర్కొన్న చంద్రబాబు ఈ సందర్భంగా ఆమెకు అభినందనలు తెలిపారు. గురజాల నియోజకవర్గంలో రాజకీయ ప్రత్యర్థుల దాడుల్లో మరణించిన 8 మంది టీడీపీ కుటుంబాలకు రూ. లక్ష చొప్పున, క్వారీ గుంతల్లో పడి చనిపోయిన చిన్నారుల కుటుంబాలకు రూ. 50 వేల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు.

More Telugu News