Stegorus Ellengassen: చిలీలో కొత్త డైనోసార్ జాతి గుర్తింపు... తోకతో కొడితే అంతే సంగతులు!

  • చిన్నదే అయినా భీకర రూపం
  • స్టెగోరస్ ఎలెన్ గాసెన్ గా నామకరణం
  • చిలీ దక్షిణ ప్రాంతంలో శిలాజాల గుర్తింపు
  • మిగతా డైనోసార్లతో పోల్చితే ఎంతో ప్రత్యేకం
New species of Dinosaur identified in Chile

కోట్లాది సంవత్సరాల కిందట భూవాతావరణంలో వచ్చిన మార్పులు తట్టుకోలేక డైనోసార్లు అంతరించిపోయాయి. ఇంతటి అతి భారీ సరీసృపాలు భూమిపై సంచరించాయంటే నమ్మడం కష్టం అనిపించినా, ప్రపంచవ్యాప్తంగా లభ్యమైన అనేక శిలాజాలు రాక్షసబల్లులు ఉనికిని నిర్ధారించాయి. వీటిలో అనేక జాతులు ఉన్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.

దక్షిణ అమెరికా ఖండంలోని చిలీ దేశంలో కొత్త రకం డైనోసార్ జాతిని గుర్తించారు. దీని శరీరంపై గట్టి కవచం ఉండడం ఒకెత్తయితే, తోక ఎంతో పదునైన నిర్మాణాలతో ఓ ఆయుధంలా ఉండడం మరో ఎత్తు. ఇలాంటి డైనోసార్ ను గతంలో ఎన్నడూ చూడలేదని పరిశోధకులు చెబుతున్నారు. ఇది రెండు మీటర్ల పొడవున ఉన్నట్టు శిలాజాల ద్వారా అర్థమవుతోంది.  ఇది 74.9 మిలియన్ల సంవత్సరాల నాటిదని భావిస్తున్నారు.

చిలీలోని దక్షిణ ప్రాంతంలో దీని అవశేషాలు దొరికాయి. దీని పూర్తి శరీర నిర్మాణానికి సంబంధించిన శిలాజాలు అన్నీ లభ్యం కావడంతో దీని ఆకృతిపై పరిశోధకులు స్పష్టమైన అంచనాకు వచ్చారు. ఆంకిలోసారస్ జాతికి చెందిన ఇతర డైనోసార్ల తరహాలోనే దీని తల కూడా సాధారణంగానే ఉండగా, శరీరం, తోక విభిన్నంగా ఉన్నట్టు గుర్తించారు.

2018లో దీని శిలాజాలు లభ్యం కాగా, ఇన్నాళ్లకు దీని కాలం, రూపురేఖలపై పరిశోధకులు స్పష్టమైన అవగాహనకు వచ్చారు. శిలాజాలు దొరికిన పెటగోనియా ప్రాంతం ప్రస్తుతం ఎంతో చల్లగా ఉంటుందని, అయితే కోట్లాది సంవత్సరాల కిందట అత్యధిక ఉష్ణోగ్రతల కారణంగా స్టెగోరస్ ఎలెన్ గాసెన్ డైనోసార్లు కాలగర్భంలో కలిసిపోయి ఉంటాయని పరిశోధకులు నిర్దిష్ట అభిప్రాయానికి వచ్చారు. ఇక్కడి భూమి పొరల్లో శిలాజరూపం దాల్చిన కొన్ని వృక్ష జాతులను పరిశీలించగా, అవి అమితమైన వేడికి గురైన ఆనవాళ్లు కనిపించాయి.

కాగా, ఈ కొత్త డైనోసార్ కు 'స్టెగోరస్ ఎలెన్ గాసెన్' అని నామకరణం చేశారు. 'స్టెగోరస్' అంటే గ్రీకు భాషలో "చదునుగా ఉన్న తోక' అని అర్థం. ఇక 'ఎలెన్ గాసెన్' అనే పదాన్ని స్థానిక జానపదాల నుంచి స్వీకరించారు. 'ఎలెన్ గాసెన్' అనేది ఓ భీకర జంతువును సూచిస్తుంది. ఇది భారీ కవచంతో ఉంటుంది.

స్టెగోరస్ ఎలెన్ గాసెన్ కు శరీరంపైనే ఎముకలు పైకి పొడుచుకుని వచ్చినట్టుగా పెరిగాయని, ఈ కారణంగానే దీని తోకకు అత్యంత విశిష్టత ఏర్పడిందని పరిశోధక బృందం నాయకుడు సెర్జియో సోటో అకునా వెల్లడించారు. స్టెగోరస్ డైనోసార్ తోకను చూస్తే రాటిల్ స్నేక్ తోక, బల్లి తోకలా అనిపిస్తోందని తెలిపారు. భారీ ఆర్మడిల్లో జంతువుల్లోనూ ఇలాంటి నిర్మాణాలే ఉండేవని, అయితే అవి కూడా అంతరించిపోయాయని వివరించారు.


More Telugu News