KCR: ప్రశాంత్ కిషోర్ తో చేయి కలపనున్న కేసీఆర్?.. నిన్న ప్రగతి భవన్ లో కీలక భేటీ!

  • పీకేతో కేసీఆర్ చేతులు కలపబోతున్నారని ముందు నుంచే వార్తలు
  • నిన్న కేసీఆర్ తో భేటీ అయిన పీకే టీమ్
  • పలు అంశాలపై చర్చించిన కేసీఆర్
KCR to work with Prashant Kishor

ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సేవలను ఇప్పటికే పలు పార్టీలు ఉపయోగించుకున్న సంగతి తెలిసిందే. ఏపీ ముఖ్యమంత్రి జగన్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా పీకేతో కలిసి పని చేశారు. పీకే టీమ్ సేవలతో వీరు గత ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. అంతేకాదు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా ఆయన సేవలను ఉపయోగించుకున్నాయి. ఇప్పుడు తాజాగా మరో ఆసక్తికర కలయిక చోటుచేసుకోబోతోంది. పీకే సేవలను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉపయోగించుకోవాలనుకుంటున్నారని విశ్వసనీయ సమాచారం. దీనికి సంబంధించి గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నప్పటికీ... సరైన ఆధారాలు మాత్రం లభించలేదు. కానీ నిన్న ఈ విషయంపై కొంత క్లారిటీ వచ్చింది.

ప్రగతి భవన్ లో కేసీఆర్ తో ప్రశాంత కిషోర్ బృందం నిన్న భేటీ అయింది. ఈ భేటీ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. టీఆర్ఎస్ కు పీకే టీమ్ పని చేయబోతోందనే అభిప్రాయన్ని విశ్లేషకులు కూడా వ్యక్త పరుస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న ఆందోళనలు కూడా పీకే సూచనల మేరకే జరుగుతున్నాయని ఇతర పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు.

మరోవైపు నిన్న కేసీఆర్ తో జరిపిన భేటీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై పీకే టీమ్ చర్చించినట్టు సమాచారం. అయితే రాష్ట్రంలోని వివిధ వర్గాల స్పందన ఎలా ఉందో అనే విషయాన్ని తెలుసుకోవడానికి కేసీఆర్ ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు, వివిధ విధానపరమైన నిర్ణయాలపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాలను సేకరించేదానిపై కేసీఆర్ చర్చించినట్టు సమాచారం.
 
దీనికి తోడు గత ఏడేళ్ల టీఆర్ఎస్ పాలనపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతపై సర్వే చేయించాలనే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ యంత్రాంగం, నాయకులపై కూడా సర్వే చేయించాలనుకుంటున్నారు. రానున్న రోజుల్లో పీకే టీమ్ నుంచి పూర్తి స్థాయిలో సేవలను పొందే యోచనలో గులాబీ బాస్ ఉన్నారని చెపుతున్నారు.

మరోవైపు వైయస్సార్టీపీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల కూడా ఇప్పటికే పీకే టీమ్ కు చెందిన వ్యక్తుల సేవలను తీసుకుంటున్నారు. పీకే టీమ్ లో క్రియాశీలకంగా పని చేసిన ప్రియా రాజేంద్రన్... షర్మిల కోసం వ్యూహాలను రచిస్తున్నారు. షర్మిల చేపట్టిన పాదయాత్ర సమయంలో కూడా ప్రియ రాజేంద్రన్ సలహాలను అందజేశారు.

  • Loading...

More Telugu News